త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. శనివారం కూడా అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్యనేతల తోనూ చర్చలు జరిపారు. మంత్రివర్గ కూర్పు ఏవిధంగా ఉండాలనే దిశగా సమాలోచనలు జరిపారు. శాస్త్రపరంగా మంత్రివర్గ విస్తరణకు ఇప్పుడు మంచిరోజులు కావడంతో ఆ దిశగా ముఖ్యమంత్రి దృష్టిసారించడం జరిగింది. విస్తరణ అనివార్యం అంటూ తాజాగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆశావహుల్లో ఉత్కంఠను రేపుతోంది. ప్రత్యేకించి ఖాళీగా ఉన్న వైద్యశాఖ, దేవాధాయశాఖకు కొత్త మంత్రులను నియమించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు.
గత కొన్ని రోజులుగా మంత్రివర్గ విస్తరణ పై వస్తున్న ఊహాగానాలకు త్వరలోనే తెరదించేందుకు సమాయత్తమవుతున్నారు. మంత్రివర్గ విస్తరణను ఇద్దరికే పరిమితం చేయాలా లేదా నలుగురికి పెంచాలా అనే విషయంలో తీవ్రస్థాయిలో తర్జనభర్జన జరుగుతోంది. రానున్నవి కీలకమైన సాధారణ ఎన్నికలు కావడంతో వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి మైనార్టీ వర్గానికి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని తొలుత ముఖ్యమంత్రి భావించారు. కానీ 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి అసెంబ్లీక్లీ ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. ఫలితంగా అప్పట్లో మైనార్టీకి మంత్రివర్గం చోటు లభించని పరిస్థితి ఏర్ప డింది. అనంతరం సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా కదిరికి చెందిన అత్తార్చాంద్ బాషా, విజయవాడకు చెందిన జలీల్ ఖాన్లు తెలుగుదేశం పార్టీలో చేరారు.
అయితే వారు ఇరువురు కూడా మైనార్టీ కోటాలో మంత్రి పదవుల రేసులో ఉన్నారు. కానీ జలీల్ ఖాన్ కు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఇవ్వడంతో రేసులో నుంచి తప్పుకున్నట్టయింది. ప్రారంభం నుంచి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న శాసనమండలి సభ్యుడు, ప్రభుత్వ విప్ అయిన ఎమ్.ఏ.షరీఫ్ కూడా మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. అంతే క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన ప్రభుత్వ విప్ పదవి కూడా షరీఫ్ కు దక్కింది. దీనితో మంత్రి పదవి విషయంలో షరీఫ్, జలీల్ ఖాన్లకు బదులుగా అత్తర్ ఛాంద్ భాషాకు మంత్రి పదవి లభించేందుకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. దీంతో రేసులో ముగ్గురు ఉన్నప్పటికీ ఛాంద్ బాషా, షరీఫ్ల మధ్య పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక స్థానం మైనారిటీ అని తేలిపోవటంతో, మిగతా స్థానం కోసం ఉత్తరాంధ్ర నుంచి, కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి కూడా ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. రాజధాని జిల్లానుంచి మంత్రి పదవికోసం రేసులో జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు పట్ల ముఖ్యమంత్రి పాజిటీవ్ దృక్పథంతో ఉన్నారు. అదే విధంగా కృష్ణాజిల్లా నుంచి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, పశ్చిమగోదావరి నుంచి నిమ్మల రామానాయుడు, తూర్పు గోదావరి నుంచి తోట త్రిమూ ర్తులు లేదా చిక్కాల రామచంద్రారావు, కడప జిల్లానుంచి మేడా, కర్నూలు జిల్లా నుంచి ఎస్.వి.మోహన్ రెడ్డి లేదా కేఈ ప్రభాకర్ తదితరులు పదవుల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి వర్గంలో మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, పంచాయతీరాజ్ ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ మాత్రమే ఎమ్మెల్సీలుగా ఎన్నికై మంత్రి పదవులు నిర్వహిస్తున్నారు.
అయితే మంత్రివర్గ విస్తరణను రాయలసీమ జిల్లాతో పాటు గుంటూరు జిల్లాల్లోని పల్నాడులో ఒక్కరికీ చోటు కల్పిస్తే ఏ విధంగా ఉంటుందనే దిశగా ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్కు ముఖ్యమంత్రి తెరదించనున్నారు. మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయమని తేలిపో వడంతో శాఖలమార్పు అనివార్యంగా కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో పథకాల అమలు, శాఖల పనితీరు, మంత్రుల సమర్థతపై ఎప్పటికప్పుడు ముఖ్య మంత్రి నర్వేలు నిర్వహిస్తున్నారు. నివేదికలు తెప్పించుకుంటు న్నారు. కనీసం 40శాతం మంది మంత్రులపై అసంతృప్తి నెలకొంది. పలు సందర్భాల్లో వారిని ముఖ్యమంత్రి నేరుగానే హెచ్చరించినప్పటికీ పెద్దగా ఫలితాలు దక్కిన దాఖలాలు లేవు. ఫలితంగానే కనీసం పదిమంది మంత్రుల శాఖలను మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది.