ఏడాదిన్నర కాలంగా, అదిగో ఇదిగో అంటూ, చెప్తూ వస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం, కావాల్సినవై అన్నీ సమకూర్చినా, లేట్ చేస్తూనే ఉన్నారు.. అయితే, ఎట్టలేకలు రేపటి నుంచి, ఆ సేవలు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎట్టకేలకు కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. గన్నవరం నుంచి కార్గో సేవలు ప్రారంభించాలని చాలాకాలంగా కోరుతూ వచ్చారు. ఎట్టకేలకు ఏడాదిన్నర కిందట కార్గో సేవలను ప్రారంభించేందుకు కేంద్ర విమానయాన సంస్థ పచ్చజెండా ఊపింది. సేవల అమలుకు భవనంతో పాటు అన్ని సౌకర్యాలు విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నాయి. సేవలు ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సి ఉండగా.. భద్రతా పరమైన అనుమతుల నేపథ్యంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు అనుమతుల ప్రక్రియ పూర్తయ్యి.. మంగళవారం నుంచి కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గన్నవరం విమానాశ్రయానికి 1980 కాలంలోనే కార్గో సేవలు అందించిన ఘనత ఉంది. అప్పట్లో స్థానికంగా ఉండే బ్యాకన్ పరిశ్రమ నుంచి మాంసం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేవారు. తరువాత కాలంలో ఈ విమానాశ్రయానికి ప్రాధాన్యం తగ్గడంతో సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం విమానాశ్రయంలో ఉండే రన్‌వే కార్గో, భారీ విమానాలు రాకపోకలకు అనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కార్గో సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించాలంటూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీయల్ ఫెడరేషన్ ప్రతినిధులు పలుమార్లు కేంద్ర పౌర విమానయానశాఖకు విజ్ఞప్తులు పంపించారు. దీంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతేడాది జులైలోనే ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. భద్రతా పరమైన అనుమతుల విషయంలో అనుకోని సమస్యలు ఎదురవ్వడంతో ఆలస్యమవుతూ వచ్చింది.
ప్రస్తుతం గన్నవరం నుంచి ప్రయాణికులతో పాటు అదే విమానంలో సరకు సరఫరా చేసే బెల్లీ కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిలో పెద్దస్థాయిలో సరకును రవాణా చేసే అవకాశం లేదు. దీనిలో అత్యవసరంగా తరలించాల్సి వచ్చినప్పుడు చిన్న, ఓ మోస్తరు సరకులను మాత్రమే తరలించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక్కడ నుంచే అన్ని రకాల వస్తువులను నేరుగా విదేశాలకు తరలించే అవకాశం ఉంది. దీని వల్ల ఆహార, వ్యవసాయోత్పత్తులు వాటి తాజాదనం పోకుండా ఉండటంతో పాటు ఖర్చు కూడా చాలా వరకు తగ్గనుందని లాజిస్టిక్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లో ఎక్కడెక్కడ మన ఉత్పత్తులకు డిమాండ్ ఉదో అక్కడికి మరింత భారీ ఎత్తున సరకు తరలించేందుకు సైతం వ్యాపార, వాణిజ్య వర్గాలు ఆసక్తి చూపుతారు.