ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు హయంలో, జాస్తి కృష్ణ కిషోర్, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ గా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవటంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రానికి అనేక కంపెనీ వచ్చాయి అంటే, కృష్ణ కిషోర్ కూడా ఒక కారణంగా చెప్ప వచ్చు. అయితే, ప్రభుత్వం మారగానే, కృష్ణ కిషోర్ పై, ఇప్పటి ప్రభుత్వం ఒక వైఖరితో ముందుకు వెళ్ళింది. ప్రభుత్వ తీరు నచ్చక, తన మాతృ సంస్థకు వెళ్ళిపోతానని, కేంద్ర సర్వీస్లకు వెళ్ళటానికి తనను రిలీవ్ చెయ్యాలని, కృష్ణ కిషోర్ ప్రభుత్వాన్ని అడగగా, ఏపి ప్రభుత్వం అనూహ్యంగా, కృష్ణ కిషోర్ కి జర్క్ ఇచ్చింది. ఆయన అవినీతి చేసారని, అందుకే ఆయన పై ఎంక్వయిరీ చేస్తున్నామని, ఆయన్ను రిలీవ్ చెయ్యటం కుదరదు అని చెప్పింది. ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. అయితే, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కృష్ణ కిషోర్, క్యాట్ వద్ద ఫిర్యాదు చేసారు. క్యాట్ కూడా ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది.
ఒక అధికారి పై, ప్రభుత్వం ఇలా కక్ష కట్టటం ఏమిటి అని ప్రశ్నించింది. అయితే, ఈ కేసు వాయిదా పడటంతో, ఈ రోజు మరోసారి ఈ కేసు పై, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) లో వాదనలు జరిగాయి. ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌కు, జీతం బకాయలు చెల్లింపులో ఎందుకు లేట్ అయ్యింది అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అయితే, చీఫ్ సెక్రటరీని పిలిపిస్తామంటూ, ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. దీంతో, ఏపి ప్రభుత్వం, ఈ రోజు హుటాహుటిన, ఆయనకు ఇవ్వాల్సిన బకాయలను విడుదల చేసింది. అయినా సరే, ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు జీతం ఇవ్వటంలో లేట్ అయ్యిందో, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరి వివరణ ఇవ్వాలి అంటూ క్యాట్ కోరింది.
క్యాట్ ఛైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, సభ్యుడు సుధాకర్‌తో కూడిన బెంచ్ ఇవాళ విచారణ చేస్తూ, ఈ రోజు, ఈ ఆదేశాలు ఇచ్చింది. రెండు వారాల్లోగా, కృష్ణ కిషోర్ కు, వేతన బకాయిలు ఇవ్వాలి అంటూ, డిసెంబర్ 24న, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటి వరకు స్పందించలేదు అంటూ, కృష్ణ కిశోర్ తరఫు న్యాయవాది క్యాట్‌కు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న క్యాట్ ప్రభుత్వం పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తూ, ఇలా అయితే చీఫ్ సెక్రెటరిని పిలిపించి వివరణ అడుగుతాం అని చెప్పి, మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణ సందర్భంగా, ప్రభుత్వం తరుపున న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ, తాము వేతనాలు ఇప్పుడే చెల్లించాం అని చెప్పారు. అయినా సరే, ట్రిబ్యునల్ తమకు ఎందుకు లేట్ అయ్యిందో వివరణ ఇవ్వాలని, సీఎస్‌ను ఆదేశించింది. తమకు కొంచెం టైం కావాలని ప్రభుత్వం కోరటంతో, కేసును ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.