ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖరీదైన క్యాథ్‌ల్యాబ్ సేవలు రోగులకు అందుబాటులో రానున్నాయి. పీపీపీ విధానంలో ఈ ల్యాబ్‌లు 13 ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. గుండె సంబంధ రోగులకు వైద్య సేవలు అందించడంలో ఈ క్యాథ్ ల్యాబ్ సేవలకు ప్రాధాన్యం ఉంది. ఒక్కో క్యాథ్‌ల్యాబ్‌కు కనీసం రూ.3 కోట్లు వ్యయమవుతుంది. అంతేకాకుండా..ప్రత్యేకంగా వైద్యులు, సాంకేతిక నిపుణులు అవసరం. ఖరీదైన ఈ సేవలు జిల్లా ఆస్పత్రుల్లో లేనందున రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రోగుల అవస్థలు తీరనున్నాయి.
ఈ క్యాథ్ ల్యాబ్ ద్వారా 20 రకాల వైద్య సేవలు రోగులకు అందుబాటులో రానున్నాయి. ఈ జాబితాలో స్టంట్స్, ఫేస్‌మేకర్, యాంజియోప్లాస్టీ వంటి సేవలు ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు నిర్దేశించిన మేరకు రూ.7,770 నుంచి 80వేల రూపాయల విలువ కలిగిన సేవలు రోగులకు అందుతాయి. ఇక నుంచి ఒక్కో కేంద్రంలో రోజుకు 25 నుంచి 30మందికి స్టంట్, యాంజియోగ్రామ్ పరీక్షలు పరీక్షలు నిర్వహించొచ్చు. గుండె పనితీరుని గుర్తించి లోపాలను తెలియజేయడం, గుండె రక్త నాలాల్లో ఉన్న బ్లాక్స్ ని, వాటి తీవ్రతని గుర్తించడం క్యాథ్ ల్యాబ్ ప్రత్యేకత. వైజాగ్ కేజీహెచ్, కర్నూలు జీజీహెచ్‌లో పదేళ్ల కిందట, గుంటూరు జీజీహెచ్‌లో ఏడేళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఇప్పటికే వీటి కాలపరిమితి ముగిసింది.
ఈ నేపథ్యంలో క్యాథ్‌ల్యాబ్‌లను వైజాగ్, కర్నూలు, గుంటూరు జీజీహెచ్‌ల్లోనే కాకుండా....కడప, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కాకినాడ, శ్రీకాకుళం బోధనా ఆస్పత్రులు, ఏలూరు, విజయనగరం జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ సుబ్బారావు వెల్లడించారు. విజయవాడ, అనంతపురం బోధనాస్పత్రులకు కేంద్రం నిధుల ద్వారా పరికరాలు రాబోతున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైంది. జూన్ చివరినాటికి సంస్థ ఎంపిక జరిగేలా వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.