జగన్ అక్రమాస్తుల కేసులో కొద్దిగా స్లో అయ్యింది అనుకున్న సిబిఐ, గత రెండ వారాలుగా, కొంచెం దూకుడు పెంచింది. జగన్ కేసుల్లో ఒకటైన, పెన్నా సిమెంట్స్ కేసులో, కొత్త విషయాలు ఉన్నాయి అంటూ, సిబిఐ ప్రత్యెక కోర్ట్ కి, అనుబంధ చార్జ్ షీట్ దాఖలు చేసారు. పెన్నా సిమెంట్ లో, పెట్టుబడులకు సంబంధించిన కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగుచూశాయని సీబీఐ, కోర్ట్ కు తెలిపింది. ఈ కొత్త అంశాల ఆధారంగానే అదనపు చార్జిషీటు దాఖలు చేశామని సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ సురేందర్‌రావు, ప్రత్యేక కోర్టుకు తెలిపారు. ఈ అదనపు చార్జిషీటును స్వీకరించాలని సీబీఐ దాఖలు చేసిన మెమోను సిబిఐ శుక్రవారం విచారించింది. గతంలో సిబిఐ, పెన్నా సిమెంట్ కేసులో పెట్టుబడుల వ్యవహారంలో ఇప్పటికే ప్రధాన చార్జిషీటు చేసినా, తరువాత మరి కొన్ని కొత్త అంశాలు రావటంతో, ఈ అదనపు చార్జ్ షీట్ వేశామని కోర్ట్ కి తెలిపారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి, పలువురు ప్రభుత్వ అధికారులు, అప్పటి ప్రభుత్వంలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్లు మెమో దాఖలుచేసినప్పటికీ, దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఎప్పుడైనా అనుబంధ చార్జిషీటు వేసే అధికారం సీబీఐకి ఉందన్నారు. ఈ అనుబంధ చార్జ్ షీట్ పై, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్ శామ్యూల్, గనులశాఖ మాజీ అధికారి వీడీ రాజగోపాల్, డీఆర్‌వో సుదర్శన్‌రెడ్డి, తహశీల్దారు ఎల్లమ్మల పై నిన్న విచారణ చేసారు. అయితే ఈ అదనపు చార్జ్ షీట్ పై, నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని చెప్పి, మళ్ళీ ఇదేంటి అంటూ, వారు అభ్యంతరం చెప్పారు.
దీని పై సిబిఐ లాయర్ స్పందిస్తూ, ఎప్పుడైనా అనుబంధ చార్జ్ షీట్ వేస్తామని, నిందితుల పాత్రను అనుబంధ ఛార్జిషీటులో స్పష్టంగా వివరించామని, ఐఏఎస్ చిరంజీవులు వాంగ్మూలాన్ని చేర్చినట్లు వెల్లడించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ అక్టోబరు 11కి వాయిదా వేసింది. ఇక జగన్, విజయ్ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నిందితులు కోర్టు అనుమతితో గైర్హాజరయ్యారు. ఇక అక్రమాస్తుల కేసులో ప్రతి వారం కోర్ట్ కి రాకుండా, తమకు మినహాయింపు ఇవ్వాలని జగన్ అభ్యర్థించగా, ఆ పిటిషన్‌పై అక్టోబరు 1న విచారణ జరగనుంది. అయితే ఉన్నట్టు ఉండి, సిబిఐ విచారణలో వేగం పెంచటంతో, రాజకీయంగా జగన్ కు ఇబ్బందులు పెట్టటానికి, బీజేపీ వైపు నుంచి, ఏమైనా వ్యూహం పన్నారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.