ప్రతి ఆక్షన్ కి, ఒక రియాక్షన్ ఉంటుంది.. మనది ఫెడరల్ దేశం... కేంద్రానికి ఏ అధికారాలు ఉంటాయో, రాష్ట్రానికి అవే అధికారాలు ఉంటాయి. నాకు నచ్చలేదు అంటూ కేంద్రం వచ్చి, రాష్ట్రం చేసే పరిపాలనలో వేలు పెట్టి, ఇబ్బంది పెడితే, అది రాష్ట్రాలకి, కేంద్రానికి ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తుంది. ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ గారికి, ఇవన్నీ తెలిసి కూడా, అవే ఆటలు ఆడుతున్నారు. అయితే, చంద్రబాబు, మమత లాంటి నేతలు, తీవ్రంగా మోడీని ప్రతిఘటిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో హై డ్రామా నడుస్తోంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ప్రమేయముందన్న ఆరోపణలపై కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన సీబీఐ అధికారులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సీబీఐ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు, సీబీఐ మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనడం బహుశా ఇదే ప్రథమం. సీబీఐ అధికారులను ఉంచిన పోలీస్ స్టేషన్ తలుపులను మూసివేశారు. మీడియాను కూడా అనుమతించడం లేదు. ఓ సీబీఐ ఉన్నతాధికారిని పోలీసులు బలంగా లాక్కొని వెళ్ళారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఈ సీబీఐ అధికారులు వచ్చారు. తమకు వారంట్ చూపించాలని పోలీసులు నిలదీశారు. అయితే రాజీవ్ కుమార్ తన నివాసంలో సీబీఐ అధికారులు పరిశీలించారు, కానీ వారికి ఆయన కనిపించలేదు. ఆయన గుర్తు తెలియని ప్రాంతానికి తరలిపోయినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి మమత బెనర్జీ కీలక అధికారులు, మంత్రులతో ఆదివారం సాయంత్రం ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. సీబీఐ అధికార వర్గాల సమాచారం ప్రకారం ముగ్గురు సీబీఐ ఉన్నతాధికారులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరిపై పోలీసులు కౌంటర్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆదివారం ముగ్గురు సీబీఐ అధికారులను అరెస్టు చేయడంతో సీబీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్లు చెప్తూ జోక్యం చేసుకోవాలని కోరేందుకు గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలవబోతున్నట్లు సమాచారం.