పట్టభద్రుల ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో జోష్ నింపాయి. ఉమ్మడి జిల్లాలు 13లో 9 జిల్లాల పరిధిలో 108 నియోజకవర్గాలలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడుకి మూడు సీట్లూ గెలిచేయడంతో కేడర్‌లో నవ్యోత్సాహం, లీడర్లలో ఊపు వచ్చింది. అయితే ఇది తెలుగుదేశం గొప్పతనం కాదని, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అనే విశ్లేషణలు ఓ పక్క ఉన్నాయి. ఉద్యోగులు, యువత వైసీపీ పాలనలో ఉన్న ఆగ్రహమే తెలుగుదేశం అభ్యర్థుల విజయం అంటున్నారు కొందరు. కానీ అసలు విషయం వేరే ఉంది. చంద్రబాబు వ్యూహాలు పార్టీ నేతలకే అంతుబట్టవు. అవి విజయాన్ని సాధించి పెట్టాయి. పరాజయం ముంగిట నిలిపాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి వచ్చేసరికి మూడు ప్రాంతాల్లోనూ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు చాణక్యం పనిచేసింది. ఉత్తరాంధ్రలో ముందుగా బీసీ వర్గానికి చెందిన ఓ మహిళా అభ్యర్థి గాడు చిన్ని లక్ష్మకుమారి పేరు ప్రకటించారు. ఎన్నికలకు సరిగ్గా నెల ముందు వేపాడ చిరంజీవిని రంగంలోకి దింపారు. ఉత్తరాంధ్రలో అతి ఎక్కువ సామాజికవర్గం వారికి దగ్గరైన కులం కావడం, పట్టభద్రులకు, ఉద్యోగులకు ఎకానమీ చిరంజీవిగా సుపరిచితులు కావడం, ఆర్థికంగా బలమైన నేపథ్యం కలిసి వచ్చాయి. ఉత్తరాంధ్ర టిడిపి అభ్యర్థి మార్పు తిరుగులేని విజయానికి మలుపుగా మారింది. తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్ ని ప్రకటించినప్పుడు పార్టీలో కొందరు నేతలు పెదవి విరిచారు. విద్యావంతుడు, సామాజికమాధ్యమాల పట్టు తెలిసిన వాడైన శ్రీకాంత్ పార్టీ లీడర్లతో సమన్వయం సాధించుకుంటూ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక పశ్చిమ రాయలసీమ నుంచి టిడిపి దింపిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని వైసీపీ తక్కువ అంచనా వేసి బొక్కబోర్లా పడింది. జగన్ రెడ్డి నక్కజిత్తుల వ్యూహాలు, బలాలు-బలహీనతలు అన్నీ తెలిసిన పులివెందుల వాసి కావడంతో పోరాడి గెలిచాడు. టిడిపి మద్దతుతో గెలిచిన ముగ్గురు కూడా రాజకీయ వారసులు కారు. పెద్ద పదవులకి ముందుగా పోటీ చేసిన వారు కాదు. ముగ్గురూ మూడు సామాజికవర్గాలు. ముగ్గురూ ఉన్నత విద్యావంతులే. సమాజంతోని-యువతతోని సంబంధాలున్న వారే కావడంతో గెలుపు పలకరించింది. చంద్రబాబు చాణక్యం అంటే ఇదే అని నిరూపించింది.
మూడు పట్టభద్రుల సీట్ల గెలుపు వెనుక చంద్రబాబు వ్యూహం ఇదే..
Advertisements