సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు, 1978 ఫిబ్రవరి 27న చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా చంద్రబాబు ఎన్నికయ్యారు... అప్పుడు తెలియదు, దేశ స్థాయిలో చక్రం తిప్పగలిగే ఒక రాజకీయ అపర చాణక్యుడు పుట్టుకొస్తాడని ... అప్పటిదాకా ఎస్వీ యూనివర్శిటీలో మాత్రమే పేరు వినిపించిన ఓ యువకుడు... దేశ రాజకీయాలను శాసించబోతాడని ఎవరూ అనుకోలేదు... కానీ, ఆ యువకుడిలో ఏదో ఉందని భావించిన ఓటర్లు... అతనికి మద్దతుగా బ్యాలెట్ పేపర్ పై ఓటు వేశారు. ఫలితం... ఒక బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి... రాజకీయరంగంలోకి ఆ యువకుడు అడుగుపెట్టాడు. అతనే నారా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోని ఆయన... ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఢిల్లీలో చక్రం తిప్పేంత స్థాయికి ఎదిగారు... చిత్తూరు జిల్లా నారావారి పల్లిలో ఒక సామాన్య రైతు కుటుంబంలో ప్రారంభమైన ఆయన జీవన ప్రస్థానం రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించేదాకా సాగింది...

cbn 40 years 2

పల్లె నుంచి తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టడం చంద్రబాబు జీవితాన్ని మలుపుతిప్పింది. విద్యార్థి నేతగా రాణించిన ఆయన కాంగ్రెస్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1978లో చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే విడతలో అంజయ్య మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో చంద్రబాబుపై అప్పటి అగ్ర హీరో ఎన్టీ రామారావు దృష్టి పడింది. ఆయన తన కుమార్తె భువనేశ్వరిని ఇచ్చి చంద్రబాబుతో వివాహం చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికే రామారావు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశాన్ని స్థాపించారు. కానీ, చంద్రబాబు టీడీపీలో చేరకుండా కాంగ్రెస్‌లోనే ఉండి పోటీ చేసి ఓడిపోయారు. అది ఆయనకు తొలి ఓటమి. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన టీడీపీలో చేరారు. 1984 సంక్షోభంలో రామారావుకు అండగా నిలిచి పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పార్టీలోకి కొత్తగా రావడంతో 1985 ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించి పార్టీ కోసం పనిచేశారు. చంద్రబాబుకు కష్టజీవి అనే గుర్తింపు అప్పుడే వచ్చింది. అదే సమయంలో ఎన్టీ రామారావు ఆయనకు అపరిమిత ప్రాధాన్యం ఇవ్వడం... కర్షక పరిషత్ అధ్యక్ష పదవికి నామినేట్ చేయడానికి ప్రయత్నించడం వివాదాస్పదంగా మారి చంద్రబాబుపై రాజ్యాంగేతర శక్తి అన్న ముద్ర పడింది.

cbn 40 years 3

1989 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ, పార్టీ ఓడిపోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రామారావుకు చంద్రబాబు తోడునీడగా నిలిచి కాంగ్రెస్‌పై బలమైన పోరాటం జరిపారు. 1994 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం తర్వాత చంద్రబాబుకు ఎన్టీఆర్ ఎతో కీలకమైన రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాలను అప్పగించారు. కానీ, పార్టీలో లక్ష్మీ పార్వతి ప్రమేయం పెరిగిపోవడం టీడీపీలో మరోసారి సంక్షోభాన్ని సృష్టించింది. ఆనాటి చీలిక పరిణామాల్లో మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు తన మామ రామారావు స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలు అప్పుడు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పెద్దసంఖ్యలో ఎంపీలను గెలుచుకుంది. జాతీయ రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు చొరవ తీసుకొని యునైటెడ్ ఫ్రంట్ పేరిట కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టారు. ఆ ఫ్రంట్‌కు ఆయన కన్వీనర్ అయ్యారు. కేంద్రంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. బయటి నుంచి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ మధ్యలో ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం ఏడాదిన్నరకు మించి మనలేదు. ఆ సమయంలో చంద్రబాబుకు ప్రధాని పదవి ఇస్తామని మిగిలిన పార్టీలు ప్రతిపాదించినా... ఆయన ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించి ససేమిరా అన్నారు.

cbn 40 years 4

ఆ తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సమానంగా సీట్లు వచ్చిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ వ్యతిరేకతతో బీజేపీని బలపర్చారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లోనూ కమలంతో పొత్తు పెట్టుకొని పోటీచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఎన్టీఆర్ లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం అదే ప్రథమం. అప్పటి వరకూ తారాజువ్వలా దూసుకుపోయిన చంద్రబాబు గ్రాఫ్ ఆ తర్వాత దిగజారడం మొదలైంది. కేసీఆర్ టీడీపీ నుంచి నిష్క్రమించి టీఆర్ఎస్‌ను పెట్టారు. 2003లో నక్సల్స్ జరిపిన 'అలిపిరి దాడి' నుంచి బాబు త్రుటిలో తప్పించుకున్నారు. అప్పుడు ఏర్పడిన సానుభూతి ఆసరాగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం వికటించడంతో... విపక్షంలో కూర్చున్నారు. వామపక్షాలను, టీఆర్ఎస్‌ను దరి చేర్చుకొని 2009 ఎన్నికల్లో మహా కూటమిని నిర్మించినా పార్టీకి విజయం దక్కలేదు. అసెంబ్లీలో బలం పెరిగినా విజయం కాంగ్రెస్‌కే దక్కింది. 10ఏళ్ళు అధికారంలో లేకపోయినా, 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసం పొందటంలో సఫలం అయ్యారు... నవ్యాంధ్ర నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యం అని, ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు...

cbn 40 years 5

చంద్రబాబు రాజకీయంగా అత్యున్నత స్థానాన్ని అందుకోవడానికి ఆయన నిరంతర శ్రమ, రాజకీయ చాణక్యం ఉపయోగపడ్డాయి. పార్టీ అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పార్టీ శ్రేణులను నిమగ్నం చేస్తూ వారికి పార్టీ పట్ల బలమైన బంధాన్ని నిర్మించడంలో ఆయన సఫలమయ్యారు. ప్రస్తుతం చంద్రబాబు వయసు 67 ఏళ్లు. జననేతగా ఆయన వయసు 40 ఏళ్లు. అయినా... 40 ఏళ్ల క్రితం ఉన్న అదే ఉత్సాహం, అదే పోరాటం, అదే కష్టపడే మనస్తత్వం... చంద్రబాబు రాజకీయ జీవితం, ఒక వన్ డే మ్యాచ్ తో పోల్చుకుంటే, 50 ఓవర్లలో చంద్రబాబు 40 ఓవర్లు ఆడేసారు... అసలైన ఆట ఆడల్సింది ఈ 10 ఓవర్లలోనే... హై స్కోర్ చేసి, ఆంధ్రప్రదేశ్ ని ఎవరూ అందుకోలేనంత ఎత్తులో చంద్రబాబు పెట్టాలని, ఆ దేవుడు చంద్రబాబుకు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, లాంగ్ లివె చంద్రబాబు గారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read