ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ రోజు రాత్రి కీలకమైన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే... అయితే, ఇంత బిజీలో కూడా చంద్రబాబు ఈ రోజు మర్చి పోలేదు.. అదే, ఈ రోజు ఆయన క్యాలెండర్ లో, సోమవారం కాదు పోలవారం... పోలవరం పై 55వ సారి రివ్యూ చేసారు... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి సంబంధిత ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణ వరకు ప్రతి విషయంలోనూ మరింత అప్రమత్తంగా వుండాలని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా, ఎవరూ వేలెత్తి చూపకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులుదేనని స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి మొదలుపెట్టే స్పిల్ చానల్ నిర్మాణం పనుల కోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
డయాఫ్రమ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పనులు లక్ష్యానికి మించి వేగంగా పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు గడిచిన వారం రోజుల్లో 4 లక్షల 20 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టితవ్వకం పనులు చేపట్టగా, 26 వేల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, డయాఫ్రమ్ వాల్ 36.8 మీటర్ల వరకు నిర్మాణం జరిగిందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో మొత్తంమీద 1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను ఇప్పటివరకు 791.17 లక్షల క్యూబిక్ మీటర్లు మేర తవ్వకం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 16.39 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు చేపట్టాల్సి వుండగా ఇప్పటికి 4.65 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 1,427 మీటర్లు పొడవైన డయాఫ్రమ్ వాల్‌కు గాను 1,095.2 మీటర్ల వరకు నిర్మాణం పూర్తయ్యింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 1,66,213.71 ఎకరాలు భూసేకరణ చేపట్టాల్సి వుండగా ఇప్పటివరకు రూ. 5,653.29 కోట్లు చెల్లించి 1,10,003.02 ఎకరాలు సేకరణ పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇంకా 56,210.69 ఎకరాల భూసేకరణ జరపాల్సి వుందని, ఇందుకు రూ. 6,370.92 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అలాగే పరిహారం, పునరావాసం ప్యాకేజీ కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన రూ. 212.55 కోట్లు కాగా, అదనంగా మరో రూ. 20,814.86 కోట్లు ఖర్చు చేయాల్సి వుందని తెలిపారు. 2018 ఫిబ్రవరి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 13,201.62 కోట్లు ఖర్చు చేయగా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన అనంతరం రూ. 8,065.75 కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఇందులో రూ. 5,342.26 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మరో రూ. 2,723.49 కోట్లు ఇవ్వాల్సివుందని చెప్పారు.