ఈ రోజు అసెంబ్లీలో అమరావతి పై చర్చ సందర్భంగా, బుగ్గన చేసిన విమర్శలకు, తమకు సమాధానం చెప్పే అవకాసం ఇవ్వాలి అంటూ, తెలుగుదేశం పార్టీ ఎమ్మేల్యేలు ఆందోళన చేసారు. అయితే, మైక్ ఇవ్వకపోగా, తెలుగుదేశం పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేసారు. దీంతో వారితో పాటుగా, చంద్రబాబు కూడా వాక్ అవుట్ చేసారు. ఈ సందర్భంగా అమరావతి పై జగన్ చూపిస్తున్న వైఖరికి నిరసనగా, ప్రజా వేదిక కూల్చిన స్థలంలో, చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఆరు నెలలు అయినా, ఇంకా ప్రజా వేదిక కూల్చిన వ్యర్ధాలు అలాగే ఉన్నాయి. దాని ముందే చంద్రబాబు ప్రెస్ మీట్ పెడుతూ, ఇది జగన్ మోహన్ రెడ్డి నైజం అంటూ, అవి చూపించారు. నేను అడిగితె ఈ బిల్డింగ్ నాకు ఇవ్వలేదు, ప్రజలకు ఉపయోగించలేదు, నేను కట్టానని కూల్చేసారు అంటూ, చంద్రబాబు అన్నారు. ఇదే సందర్భంలో అమరావతి పై అసెంబ్లీలో జరిగిన చర్చ, తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే అంశాల పై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ఇదే సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో, మూడు రాజధానాలు విషయం గురించి ప్రకటన చేసారు. ఇదే సమయంలో ప్రెస్ మీట్ లో ఉన్న చంద్రబాబుకు, మూడు రాజధానుల విషయాన్ని అచ్చెన్నాయుడు చంద్రబాబుకు వివరించారు. ఇప్పుడే అసెంబ్లీలో చెప్పారట, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషయల్, లెజిస్లేటివ్ అంటూ మూడు రాజధానులు చేస్తారాట. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ రాజధాని అంట అంటూ చంద్రబాబుకు ప్రెస్ ముందే చెప్పారు. దీని పై చంద్రబాబు స్పందిస్తూ, ఇలా ఉంది మన రాష్ట్రం. పిచ్చోడి చేతిలో రాయలాగ, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ, జగన్ పై విమర్శలు గుప్పించారు.
ఎక్కడైనా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ, పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కుంటారని అన్నారు. హైకోర్ట్ ఒక చోట, అసెంబ్లీ ఒక చోట, సెక్రటేరియట్ ఒక చోట పెడితే, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో, కనీసం ఆలోచించారా అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో 70 వేల కోట్ల డేటా సెంటర్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేశారని, ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తే ప్రజలు జీవితాలు బాగుపడతాయి కాని, ఇలాంటి తుగ్లక్ చర్యలతో, ఇబ్బందులు పడతారని అన్నారు. ఇన్ని రాజధానులు ఏర్పాటు చేసి రేపు ముఖ్యమంత్రి ఏ రాజధానిలో కూర్చుంటాడని ప్రశ్నించారు. సీఎం అమరావతిలో ఉంటారా.. విశాఖలో ఉంటారా.. ఇడుపులపాయలో ఉంటారా? అని ప్రశ్నించారు. తరువాత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, టిడిపి విధానం చెప్పారు. అమరావతి రాజధానిగా ఉండాలని, కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలకు జరగాలనేదే తమ విధానం అని అన్నారు.