ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, ఒక నేరస్థుడికి కూడా చేతులు ఎత్తి దండం పెట్టా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు, గత ఎనిమిది నెలలుగా, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై, జరుగుతున్న పరిణామాల పై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు అభివృద్ధిలో, ఇటు సంక్షేమంలో వెనుకబడి పోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా, చంద్రబాబు, అసెంబ్లీలో జరిగిన వీడియో వేసి, చంద్రబాబు చూపించారు. "చిన్నవాడివైనా చేతులు జోడింది దండం పెడుతున్నా, తొందర పాటు నిర్ణయాలు వద్దు అండి. భావి తరాలను ద్రుష్టిలో పెట్టుకోండి" అంటూ ఆ వీడియోలో ఉంది. తరువాత చంద్రబాబు మాట్లాడుతూ, ఆవేదనతో మాట్లాడారు. ఇంత అనుభవం ఉన్న నేను, ఒక నేరస్థుడికి, వారం వారం కోర్ట్ కు వెళ్ళే వ్యక్తికి, చేతులు జోడించి దండం పెట్టానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూసి, ప్రజల కోసం, అలా చేసానని, అయినా ఈ మనిషి మారలేదు అంటూ, చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు.
చంద్రబాబు మాట్లాడుతూ, "నాపై కక్షతో రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని అడిగాను. ఒక నేరస్తుడికి దండం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఎందుకు పెట్టానంటే రాష్ట్రం కోసం, ప్రజల కోసం పెట్టాను. కక్షలు, కార్పణ్యాలకు రాష్ట్రాన్ని నెలవుగా చేస్తారా..? రాజధాని అమరావతిపై ఎన్ని కమిటిలు వేస్తారు..?కేబినెట్ కమిటి, పీటర్ కమిటి, జిఎన్ రావు కమిటి, బోస్టన్ కమిటి, హై పవర్ కమిటి దేనికి ఇవన్నీ..? ఎందుకీ ప్రాంతంపై ఇంత కక్ష నీకు..? ఇది రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం కాదా..? విశాఖకు, కర్నూలుకు చేయాల్సినవన్నీ చేద్దాం. ఓర్వకల్లులో విమానాశ్రయం నిర్మిస్తే కనీసం విమానాలు తేలేక పోయారు. విశాఖకు వచ్చిన కంపెనీలన్నీ తరిమేశారు, పెట్టుబడులు, ఉద్యోగాలు పోగొట్టారు. ఒక వ్యవస్థను కుప్పకూల్చారు. ఒక సానుకూల వాతావరణాన్ని నాశనం చేశారు. తెనాలిలో తగులపెట్టిన జెఏసి శిబిరాన్ని సందర్శించే స్వేచ్ఛ నాకు లేదా..? అదే మా గ్రామంలో మీటింగ్ పెట్టేందుకు వైసిపి వాళ్లకు అనుమతిస్తారా..? 30వ తేదీదాకా నన్ను తెనాలి వెళ్లవద్దని అంటారా..? నేను రేపు తెనాలి వెళ్తున్నాను. మాజీమంత్రి జవహర్ పై ఆంక్షలు పెడతారా..? అక్రమ కేసులు బనాయిస్తారా..? ఇక్కడ మద్యం రేట్లు ఎందుకు పెంచావు..? నీకు కమిషన్లు ఇచ్చే బ్రాండ్లే అమ్ముతావా..?"
"తెలంగాణ, కర్ణాటక నుంచి మద్యం అక్రమ సరఫరా అవుతోంటే చోద్యం చూస్తున్నారా..? ఆర్టీసి ఛార్జీలు రూ 700కోట్లు పెంచారు, పెట్రోల్ డీజిల్ రేట్లు రూ 500కోట్లు పెంచారు. పేదల నడ్డి విరిచేలా భారాలు మోపుతారా..? ఇప్పటికీ రాష్ట్రంలో ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఇసుక ధర మూడునాలుగు రెట్లు పెంచేశారు. ఇదొక రద్దుల ప్రభుత్వం..ఉచిత ఇసుక, అన్నా కేంటిన్లు, కాపు రిజర్వేషన్లు, పండుగ కానుకలు, ఫుడ్ బాస్కెట్ రద్దు, విమాన సర్వీసులు రద్దు, దివ్య దర్శనం రద్దు. భరోసా ఇస్తామని రైతులకు ఆంక్షలు పెడతారా..? కేంద్రం ఇచ్చేదానితో కలిపి రూ 18,500ఇస్తామని చెప్పి 13,500ఇచ్చి, రూ 5వేలు ఎగ్గొడతారా.. ? 14లక్షల మంది కౌలు రైతులకు ఇస్తామని చెప్పి కనీసం 3లక్షల మందికైనా ఇచ్చారా..? ఇంతవరకు స్కాలర్ షిప్ లు పైసా ఇచ్చారా విద్యార్దులకు..? అమ్మవడి కింద కార్పోరేషన్ల సొమ్ము ఇస్తారా..? బిసి, ఎస్సీ,ఎస్టీ కార్పోరేషన్ల సొమ్ము మళ్లిస్తారా అమ్మవడికి..? 7లక్షల మందికి పించన్లు ఎగ్గొడతారా..? మీరు టిడిపి కాబట్టి పెన్షన్ ఇవ్వం అంటారా..? పేదరికానికి పార్టీ ఉంటుందా..? పేదల పొట్టకొట్టడమే మీ వాలంటీర్ల పనా..? మీ వాలంటీర్ కు ఏడాదికి రూ 96వేలు ఇస్తూ పేదవాడికి నెలకు రూ 3వేలు పెన్షన్ ఇవ్వలేరా..?" అని చంద్రబాబు అన్నారు.