ప్రభుత్వ పథకాల అమల్లో ఆన్‌లైన్ విధానం అమల్లోకి తేవడం వల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయిందని ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారమిక్కడ హ్యాపీ రిసార్ట్స్ సమావేశ ప్రాంగణంలో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని పార్టీ నేతలతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ లోక్‌సభ సీటు పరిధిలోని ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొందరు నాయకులు మాట్లాడారు. ఆన్‌లైన్ విధానం గురించి ప్రస్తావించారు. ‘సార్.. మీరు అన్ని పథకాలకూ ఆన్‌లైన్ విధానాన్ని తెచ్చారు. దీనివల్ల పార్టీకి, ప్రజలకు మధ్య అనుబంధం లేకుండా పోయింది.
పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలు నేరుగా ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి వచ్చేస్తున్నాయి. అంతకు ముందు పార్టీ నేతల చొరవతో ఇవి వచ్చేవి. దానివల్ల పార్టీ ప్రాధాన్యం ప్రజలకు తెలిసేది. ఆన్‌లైన్ విధానంలో పార్టీ ప్రమేయం లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు పార్టీని చులకనగా చూస్తున్నారు. ఇవి టీడీపీ ఇచ్చింది కాదని.. అర్హులం కాబట్టే లబ్ధి చేకూరిందని అనుకుంటున్నారు తప్ప.. టీడీపీ ప్రభుత్వ కృషి వల్ల వచ్చిందని భావించడం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా అవి వచ్చేవేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. దీనిపై మీరు పునరాలోచన చేయాలి’ అని వారు సీఎంకు సూచించారు. ఇందులో కొంత నిజం ఉన్నా.. మొత్తంగా సదుద్దేశంతో ఈ విధానం తెచ్చామని చంద్రబాబు వివరించారు. ‘పథకాల అమల్లో అవినీతిని తగ్గించడానికి ఆన్‌లైన్ విధానం తెచ్చాం. దానితోపాటు జాప్యం కూడా నివారించాలన్నది మన ఆలోచన. ప్రతి ప్రయత్నంలో కొంత మంచి.. కొంత సమస్యా ఉంటుంది. ప్రజలతో పార్టీ అనుబంధాన్ని పెంచడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం’ అని చెప్పారు. పార్టీ కార్యకర్తలను ఆదుకోవాల్సిన అవసరం గురించి కొందరు మాట్లాడారు. ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి చెందిన పార్టీ నేతలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన సమీక్షకు ఆ నియోజకవర్గం నుంచి ఎవరూ హాజరు కాలేదు. రెండ్రోజుల క్రితం శ్రీకాకుళం సిటింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవి తండ్రి మరణించారు. దీంతో ఆమె రాలేకపోయారు. ఆమె రావడం లేదని ఆ నియోజకవర్గ నేతలు కూడా ఎవరూ రాలేదు. మరోసారి అందరం కలిసి వద్దామన్న ఆలోచనతో వారు రాలేదని అంటున్నారు. దానిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎమ్మెల్యే రాకపోవడానికి కారణం ఉంది. కానీ నియోజకవర్గ నేతలు కూడా రాకపోతే ఎలా? పార్టీ ఒక సమావేశం పెడితే దానిని సీరియ్‌సగా తీసుకోవాలి. ఇక్కడ మేం కొన్ని విషయాలు చెబుతున్నాం. వాటిని అందరూ తెలుసుకోవాలి. ఏవో సాకులు చెప్పి రాకపోవడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు.