శుక్రవారం చంద్రబాబు ఉండవల్లి ప్రజా వేదికలో మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ మళ్లీ గెలవరని ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా అందరికీ అర్థమైందని చంద్రబాబు అన్నారు. దీంతో తాజాగా రెండు పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటున్నాయని చంద్రబాబు చెప్పారు. ఆ రెండు పార్టీలేంటన్నది ఇప్పుడే వెల్లడించనని... మరికొన్ని పార్టీలు కూడా వాటితో కలిసి వస్తాయని అన్నారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో జాతీయ రాజకీయాలపై ఏమైనా మాట్లాడారా? అని ప్రశ్నించగా...తుపాను సాయంపై రెండుసార్లు మాట్లాడానని బదులిచ్చారు. ఇక... మోదీ ఏం మాట్లాడినా ఈసీకి సంగీతంలాగే ఉంటుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని పశ్చిమ బెంగాల్లో మోదీ ప్రకటించినా పట్టించుకోలేదన్నారు.
ఇక... ఫణి తుఫాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లో వేగంగా స్పందించి ప్రజలకు సాయం అందించేందుకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని అడిగితే... తాపీగా తుఫాను తీరం దాటాక అనుమతి ఇచ్చిందని తెలిపారు. అంతకుముందే తుఫానుపై అధికారులతో సమీక్ష చేసి సమన్వయం చేశామని తెలిపారు. ‘‘మొన్నటివరకు అధికారులుగా ఉన్నవారే ఎన్నికల సంఘం కమిషనర్లుగా నియమితులయ్యారు. మోదీ వారిని నియమించినంత మాత్రాన హద్దులు దాటి ప్రవర్తించకూడదు. రాష్ట్ర సీఈవోకు కూడా ఇదే వర్తిస్తుంది’’ అని అన్నారు.
జగన్ తాజాగా హైదరాబాద్‌లో ‘అవెంజర్స్... ద ఎండ్ గేమ్’ సినిమా చూశారని ఒక పాత్రికేయుడు ప్రస్తావించగా... ‘‘చూడనివ్వండి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఇక్కడ సమస్యలేమీ లేకుండా సజావుగా చూసుకుంటోంది కదా! ఇక ఆయనకు ఇక్కడ ఏ పనీ లేదు. హైదరాబాద్‌లో కేసీఆర్‌తో టచ్‌లో ఉంటూ హాయిగా ఉన్నారు. ఆయనకు ఇక్కడ తుఫాన్లు, ప్రజలు ఎవరూ పట్టరు’’ అని చంద్రబాబు బదులిచ్చారు. వీవీ ప్యాట్ల లెక్కింపుపై 23 రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంఘాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం సంతోషకరమని చంద్రబాబు చెప్పారు. వీవీప్యాట్లు లెక్కించేందుకు ఆరురోజుల సమయం పడుతుందంటూ సుప్రీంకోర్టును ఈసీ తప్పుదారి పట్టిస్తోందని తెలిపారు.