మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖలోని నోవోటెల్ హోటల్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. విశాఖలో భూమిని అభివృద్ధి చేసి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక, పారిశ్రామిక, ఆటోమొబైల్స్, టెక్స్ టైల్స్ రంగాల్లో ఏపీ ముందుందని వివరించారు. రాష్ట్రంలో ఎంతో మంతి ప్రతిభ కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారని, దానికి మంచి ఉదాహరణ మన ముందే ఉన్నారని మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్‌ను చూపించారు. మార్గదర్శిని అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దిన ప్రతిభ ఆమెదని కొనియాడారు. మహిళా సాధికారతతో ఇలాంటి కంపెనీలు మరిన్ని పుట్టుకురావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు సార్క్ దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాల నుంచి సుమారు 40 మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు పారిశ్రామికంగా ఎదగడానికి అవసరమైన పలు కీలక అంశాలపై 12 చర్చా కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. వీటిలో 54 మంది వివిధ రంగాలకు చెందిన నిపుణులు ప్రసంగిస్తారు. ముఖ్యంగా విదేశాల్లో వ్యాపారావకాశాల్ని చేజిక్కించుకోవడానికి అనుసరించాల్సిన నిబంధనలేమిటి? ఏఏ రంగాల్లో ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి? ఎగుమతులు, దిగుమతుల రంగాల్లో రాణించాలంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరం? తదితర అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు.
ఎగుమతులు, దిగుమతుల కార్యకలాపాలు నిర్వహించడానికి ఇబ్బంది పడకుండా, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించాలన్న లక్ష్యంతో ‘విత్’ (ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ హబ్) పేరిట ఒక కేంద్రాన్ని విశాఖ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కేంద్రం రానున్న రోజుల్లో అందించే సేవలేమిటన్న అంశాలనూ వివరిస్తారు. అంతర్జాతీయ అంశాలపై మహిళలకు అవగాహన కల్పించడానికి వీలుగా ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ నుంచి ముగ్గురు ప్రతినిధులు వస్తున్నారు. వివిధ ఉత్పత్తుల తయారీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న పరిజ్ఞానాలేమిటి? అవే ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతలేమిటి? కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్లు ఎలా మారాలి? తదితరాలను వివరిస్తారు. పారిశ్రామికవేత్తలుగా, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మహిళలు రాణించడానికి వీలుగా ఎలీప్ అంకుర కేంద్రాలు ఏర్పాటుచేసి అందిస్తున్న సేవలు మహిళలకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయన్న వివరాలపై కూడా అవగాహన కల్పిస్తారు.