ఢిల్లీ స్థాయిలో మోడీ, షా డ్రామాలు ఆడుతూ, సీన్ పండిస్తుంటే, ఇక్కడ ఏపిలో కూడా అదే రకమైన డ్రామాలు మొదలు పెట్టారు బీజేపీ నేతలు. ఈ రోజు చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తూ, రాజీనామా లేఖ పంపించారు మాణిక్యాలరావు. 4 ఏళ్ళు చంద్రబాబు పక్కనే మంత్రిగా కూర్చుకుని, పదవులు అనుభవించి, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని.. దీనికి నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్లు చెప్తూ, 15రోజుల్లోగా స్పందించాలని, లేని పక్షంలో ఆమరణ దీక్ష చేస్తాను అంటూ లేఖలో రాసారు.
తాడేపల్లిగూడెం బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు రాజీనామా పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఏపీకి ఏం చేయని బీజేపీపై పోరాడకుండా కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాడేపల్లి గూడెం సహా పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రతి అభివృద్ది కార్యక్రమాన్ని చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడం తన బాధ్యత అని అన్నారు. సొంత జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వకపోతే మాణిక్యాలరావు ఎందుకు ఎందుకు మాట్లాడరని చంద్రబాబు ప్రశ్నించారు.
మాణిక్యాలరావు పోలవరంపై కేంద్రంతో పోరాడి... రాజీనామా చేస్తే బాగుండేదని చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని, రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని అన్నారు. చిల్లర రాజకీయాలు, రాజీనామా పేరుతో బెదిరించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. మంత్రిపదవికి రాజీనామా చేసి.. టీడీపీతో తెగతెంపులు చేసుకున్నాక.. అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో ప్రభుత్వం తమకు ఎంతో సహకారం అందించిందని మాణిక్యాలరావు చెప్పారు. ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణులు కూడా ప్రస్తావించారు. నాలుగేళ్లుమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఏమీ స్పందించని మాణిక్యాలరావు.. ఇప్పుడు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్న సమయంలో రాజీనామా డ్రామాకు తెర తీశారని టీడీపీ నేతలు ఆరోపించారు.