అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం విశ్వవిద్యాలయం అధినేత, తెదేపా ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతిచెందారు. మంగళవారం కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ప్రమాద సమయంలో ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి మృతి చెందగా.. కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తానా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియా జరగనున్న గీతం పూర్వవిద్యార్థుల సమావేశంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది.
విశాఖపట్నం అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. నగరాన్ని పారిశ్రామిక కేంద్రంగా, విద్యానిలయంగా మార్చిన తొలి తరం నేతల్లో ఆయన ఒకరు. ఆయనే మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి. ఈ పేరు చెబితే ఎవరికీ తెలియదుగానీ, గోల్డ్ స్పాట్ మూర్తి అంటే మాత్రం విశాఖలో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. ఒకప్పుడు ఎంతో పేరున్న గోల్డ్ స్పాట్ శీతల పానీయాలను తయారు చేసే ఆయన్ను ప్రజలు 'గోల్డ్ స్పాట్ మూర్తి'గా ముద్దుగా పిలుచుకునేవారు. అనతికాలంలోనే ఈ వ్యాపారంలో రాణించిన ఆయన, గీతం యూనివర్శిటీని స్థాపించి వేలాది మందికి విద్యాదానం చేశారు.
ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యావేత్తగా, విద్యాదాతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్ర వేశారన్నారు. గీతం సంస్థను స్థాపించి వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. విద్య, రాజకీయ రంగాలకు మూర్తి లేని లోటు ఎవరూ తీర్చలేరని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి తెదేపా, విశాఖ ప్రజలకు తీరని లోటన్నారు. తెదేపా ముఖ్య నేతలందరూ రోడ్డు ప్రమాదాల్లోనే మృతిచెందడం తనను కలిచివేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.