‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా చూసేందుకు సీఎం చంద్రబాబు నగరంలోని నిన్న క్యాపిటల్ థియేటర్‌కు వెళ్లారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, నటుడు నారా రోహిత్, మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య, పలువురు టీడీపీ నేతలు వారి కుటుంబ సభ్యుల సమేతంగా సినిమాను వీక్షించారు. కాగా ఎన్టీఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ఈ చిత్రం బుధవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ పాత్రలో స్వయంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లోని మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కాగా రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్.
సినిమా చూసిన తరువాత చంద్రబాబు, మీడియాతో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని, ఇవన్నీ చూస్తుంటే పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఇందులో చూపించారని, ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. ఎన్టీఆర్ సినిమాలో తన పాత్రపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. ‘నా పాత్ర ఎలా ఉందన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు’ అని పేర్కొన్నారు. నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. సినిమాను క్రిష్ అద్భుతంగా తీశారని, బాలకృష్ణ బాగా నటించారని కొనియాడారు.
ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలిసారు. ఇద్దరినీ ముఖ్యమంత్రి సత్కరించారు. ఎన్టీఆర్ పాత్రను అద్భుతంగా నటించారని తరువాత, బాలకృష్ణను ప్రశంసించారు చంద్రబాబు. 'ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించి మహానటుడి జీవితాన్ని,త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చిన దర్శకుడు క్రిష్ ను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రజలకు స్పూర్తిని ఇచ్చే, ఇలాంటి బయోపిక్ లు ఇంకా రావాలని, భావితరాలు ఇవి చూసి, ఆ మహోన్నత వ్యక్తులు ఎలా పైకి వచ్చింది తెలుసుకుని, ఆ స్పూర్తి తీసుకోవాలని చంద్రబాబు అన్నారు.