రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాము పోరాడుతుంటే.. ప్రతిపక్షాలు తెదేపాపై పోరాడుతున్నాయని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు తెదేపాపై చూపుతున్న అభిమానాన్ని ఓర్వలేక నాలుగు పార్టీలు ఏకమై అక్కసు పెంచుకున్నాయని సీఎం ఆరోపించారు. బీజేపీ, వైసీపీ, తెరాస, జనసేన పార్టీలు టిడిపినే లక్ష్యంగా చేసుకున్నాయని దుయ్యబట్టారు. తాను బాధితుల్ని పరామర్శిస్తుంటే.. వైసీపీ ప్రజలను రెచ్చగొట్టి అడ్డంకులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక పవన్‌కల్యాణ్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నాడని ఆరోపించారు.
వారు తమపై ఎంతగా గురి పెడితే తమకు అంత లాభమని.. వారి తిట్లే తమకు ప్రజా దీవెనలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓటర్ల నమోదు, కౌన్సిల్ ఎన్నికలు, బూత్ కన్వీనర్ల శిక్షణ, గ్రామ వికాసం పురోగతిపై నేతలతో సీఎం చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభత్సం సృష్టించినా.. కేంద్రం నుంచి ఒక్క భాజపా నేత కూడా రాలేదని, ఎలాంటి సాయం అందించలేదన్నారు. రాజమహేంద్రవరంలో పవన్ కవాతును ప్రశంసించిన కేటీఆర్.. తిత్లీ తుపాను బాధితులపై కనీసం సానుభూతి కూడా ప్రకటించకపోవటం బాధాకరమన్నారు.
వైకాపా అధ్యక్షుడు జగన్ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదని, ఆయన ఫ్యాక్షన్ మనస్తత్వమే దానికి కారణమన్నారు. జగన్ చిత్తశుద్ధితో పాదయాత్ర చేయట్లేదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, మరో నాలుగేళ్లు ఆయన పాదయాత్ర చేసిన ఫలితం రాదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాభిమానం తమపై ఉందని, అదే తమ నైతిక బలమని పేర్కొన్నారు. తాను ఒక్కడినే కష్టపడితే చాలదని.. పార్టీ సభ్యులంతా కష్టించి పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.