కోడి కత్తిని నమ్ముకుంటే జైలుకు పోతారని సీఎం చంద్రబాబు అన్నారు. నగరిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘సీపీఎస్ రద్దు చేస్తూ కేంద్రానికి లేఖ రాస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా. గాలేరు నగరి, సోమశిల, స్వర్ణముఖి పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత నాది. నగరి, పూత్తూరు, చిత్తూరును మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తా. ఇక్కడి ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉన్నారా?. నియోజకవర్గానికి ఏమైనా చేశారా?. ఏనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారా?. ఆమెకు (వైసీపీ అభ్యర్థి రోజా) హైదరాబాద్‌లో టీవీ షోలు తప్ప.. ప్రజలను పట్టించుకోరు. ఆమె వల్ల ప్రజలకు ఏ ఉపయోగం లేదు. ఇక్కడి ఎమ్మెల్యేకు నోటి దురుసు. పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినా పట్టించుకోలేదు. వాళ్ల నాయకుడు నన్ను 420 అంటాడా?. చెప్పుతో కొడతా అంటున్నాడు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపించాలి..మళ్లీ పోటీ చేయకుండా గుణపాఠం చెప్పాలి.’’ అని అన్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రచారానికి రాకుండా ఇవాళ లోటస్ పాండ్‌లో ఉండిపోయారని విమర్శించారు. లోటస్‌పాండులో డబ్బులు లెక్కపెట్టుకుంటూ కూర్చున్నారని ఆరోపించారు. తాను మాత్రం జనం మధ్యలోనే ఉన్నానని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా, మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ తన తండ్రి వైఎస్‌ను అడ్డం పెట్టుకుని రూ లక్ష కోట్లు సంపాదించారని విమర్శించారు. జగన్ తప్పులు చేశారు కాబట్టే భయపడుతున్నారన్నారు. ప్రచారానికి రాకుండా కుట్ర చేయడానికి లోటస్‌పాండ్‌లో ఉన్నారని సీఎం ఆరోపించారు. జగన్ ఎప్పుడైనా ఏపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్, జగన్ లాలూచీ పడ్డారని ఆరోపిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు మరింత దూకుడుగా విమర్ళల దాడి పెంచారు. హైదరాబాద్‌లో కూర్చునే కేసీఆర్‌కు జగన్ ఊడిగం చేసుకుంటే అభ్యంతరం లేదని, కానీ ఏపీకి ద్రోహం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చి, ఏపీకి లక్ష కోట్లు ఎగ్గొడతారని బాబు ఆరోపించారు. జగన్ పేరులోనే గన్ ఉందని, ఆయన జీవితమంతా నేరాలు, ఘోరాలేనని విమర్శించారు. ఐదేళ్లలో నియోజకవర్గానికి రోజా చేసిన ఒక్క పనైనా ఉందా అని ప్రశ్నించారు. ఆమెకి అభివృద్ధి తెలియదు కానీ నోరు పారేసుకోడం మాత్రం బాగా తెలుసన్నారు. నాయకుడిని బట్టే ఎమ్మెల్యేలు కూడా ఉంటారని.. జగన్మోహన్ రెడ్డిని బట్టే రోజా కూడా అలానే తయారయ్యారన్నారు. ఇలాంటి వాళ్ళను మళ్ళీ పోటీ కూడా చేయకుండా బుద్ధిచెప్పాలని.. డిపాజిట్లు కూడా రాకుండా బుద్దిచెప్పాలన్నారు.