రౌడీలు ఏపీ బయటే ఉండాలని, పోలీసుల త్యాగాలకు నిదర్శనమే అమరవీరుల సంస్మరణ దినం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు పేర్కొన్నారు. ఆదివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తూ... ఎర్రచందనం సంపదను ప్రాణాలు అడ్డేసి పోలీసులు కాపాడారని, అలాగే విజిబుల్ పోలీసింగ్.. ఇన్విజిబుల్ పోలీస్ విధానం అవలంభించాలన్నారు. రాజకీయం ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలను అడ్డుకోవడంపై పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, తుని ఘటన, విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనలు అలాంటివేనని సీఎం అన్నారు.
పోలీసులు తమ జీవితాన్ని దేశం కోసం ప్రజల కోసం అంకితం చేయడం గొప్పసేవానిరతి అన్నారు. పోలీసులకు కుటుంబం కంటే ప్రజాసేవ అంటేనే ఇష్టం అని, అలాగే ‘ప్రజల భద్రతే మా ధ్యేయం.. ఫ్రెండ్లీ పోలీసింగే మా లక్ష్యం’ అని సీఎం అన్నారు. దేశ వ్యాప్తంగా 414 మంది, రాష్ట్రవ్యాప్తంగా 6గురు పోలీసులు విధినిర్వహణలో మరణించారని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. పోలీసు కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని.. ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించే బాధ్యతను పోలీసులు సమర్ధవంతంగా నిర్వహించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు కోరారు.
రాజకీయ ముసుగులో అరాచకాలు సృష్టించాలనుకునే వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అధునాతన సాంకేతికతను తమకు అనువుగా మార్చుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపట్ల జాగరూకులై ఉండాలని కోరారు. పోలీసు సంక్షేమ నిధికి రూ.15 కోట్లను కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పోలీసు కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీసు ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ విరమణలోగా కనీసం ఒక పదోన్నతైనా వచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని.. త్వరలో 2500 కానిస్టేబుళ్ల నియామకం చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు. హాజరైన వారంతా అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.