బుధవారం రాత్రి అసెంబ్లీ కమిటీ కార్యాలయంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి సీటు ప్రధానమే.. అన్ని నియోజకవర్గాల్గో గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం, పార్టీపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయన్నారు. కొత్త రాష్ట్రంలో ఆర్థికంగా అనేక కష్టాల్లో ఉండి కూడా గతంలో ఎన్నడూ జరగనన్ని పనులు చేస్తున్నాం, కాని అవి సరిగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతున్నారు అని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో సానుకూలతే నాకు కొలబద్ద, దాని కోసం అందరూ పని చెయ్యండి అని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణాలో జరుగుతున్న పరిస్థితి పై స్పందించారు. ‘‘తెలంగాణలో అధికార పక్షానికి అంతా బాగుందని మీడియాలో చూసేవాళ్లం. కానీ, అసెంబ్లీ రద్దు తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయికి వెళ్తే నిలదీతలు ఎదురవుతున్నాయి. ఇక్కడ మన వద్ద ఏం జరుగుతున్నా మీడియా రాస్తోంది.. చూపిస్తోంది. దీనివల్ల లోపం ఉంటే దిద్దుకోగలుగుతున్నాం. తెలంగాణలో పరిస్థితిని తెచ్చుకోకూడదనుకొంటే మరింతగా ప్రజల్లో ఉండండి. ఎన్నికలు వచ్చినప్పుడే మాత్రమే కనిపిస్తున్నారని... అంతకుముందు అందుబాటులో లేరని అనిపించుకోవద్దు’’ అని హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలతో చాలా మంది ఎమ్మల్యేలు అవాక్కయ్యారు. మీడియాలో ఏపి పట్ల చూపిస్తున్న వివక్ష పై, చంద్రబాబు ఫైర్ అవ్వల్సింది పోయి, దీన్ని కూడా పోజిటివ్ గా తీసుకుని, మన తప్పులు సరిదిద్దుకునే విధంగా చేస్తున్నారని, చంద్రబాబు బలే పోజిటివ్ అని అంటున్నారు.
ప్రతినెలా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరును విశే్లషిస్తున్నా.. ప్రజలతో వినయంగా ఉండాలని.. కార్యకర్తలను గౌరవంగా చూడాలన్నారు. ప్రతిపక్షంపై కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రజలతో సాన్నిహిత్యం, కార్యకర్తల పట్ల గౌరవం, ప్రతిపక్షంతో కఠినంగా వ్యవహరించటం నాయకత్వ లక్షణాలని వివరించారు. ఏపీలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగినన్ని పనులు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. దీంతో ఏకీభవిస్తున్నారా అని ప్రశ్నించగా... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా చేతులు ఎత్తారు. పనులు ఇంత బాగా జరిగితే ఎమ్మెల్యేలకు సునాయాస విజయం చేతికి అందాలని, ఎందుకు కష్టపడాల్సి వస్తోందో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీల్లో విశ్రాంతి ధోరణి మరింత పెరిగిపోయిందన్నారు. ఇక నిరంతరం ప్రజల్లో ఉండాలని నిర్దేశించారు. గ్రామ వికాసం, వార్డు వికాసం కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. ప్రతిరోజు పనితీరును విశే్లషించు కోవాలన్నారు. గ్రామ వికాసం కార్యక్రమం కింద ఇప్పటి వరకు 22 శాతం మాత్రమే పూర్తయిందని, వచ్చే మూడు నెలల్లో నూరు శాతం పూర్తిచేయాలన్నారు. గ్రామ వికాసంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాం పెరగాలన్నారు.