దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తాజ్ పాలెస్‌లో పారిశ్రామిక వేత్తలకు అమరావతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ దేశంలో అగ్రస్థానంలో ఉండాలని తను విజన్ రూపొందించుకున్నట్లు చంద్రబాబు వారికి తెలిపారు. 2050 నాటికి ఏపీ ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్‌గా అమరావతి ఉండాలనేదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని అన్నారు. అభివృద్ధి చేసిన భూ బ్యాంకు అందుబాటులో ఉందని, పారిశ్రామికవేత్తల ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి టెక్నాలజీని వినియోగిస్తున్నామని, సీఎం కోర్‌డాష్ బోర్డు ద్వారా అన్ని వివరాలు తెలుసుకుంటున్నామని రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ వరుసగా అగ్రస్థానంలో నిలిస్తోందన్నారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, బెంగుళూరు- చెన్నై కారిడార్, కర్నూలు- చెన్నై కారిడార్ ఇలా వేర్వేరు ఉత్పత్తి నోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెట్రో కెమికల్స్, హెల్త్, పర్యాటక, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విధానాలు ఉన్నాయని, అభివృద్ధి చేసిన భూ బ్యాంకు అందుబాటులో ఉందని పారిశ్రామిక వేత్తలకు సీఎం తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి ముందుకు వెళ్తున్నామని, భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
అమరావతి ల్యాండ్ పూలింగ్ పై మాట్లాడుతూ, "నయా రాయపూర్ లో 4వ ఏడాది తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ ప్రారంభం అయితే ప్రభుత్వ అధీనంలోకి 90% భూమి రావడానికి 15ఏళ్లు పట్టింది. అదే అమరావతిలో ల్యాండ్ పూలింగ్ 6నెలల్లో పూర్తిచేశాం,3వ ఏడాదికే 90%భూమి ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. పుత్రజయలో ఉద్యోగుల రాక 13వ ఏడాది జరిగితే,అమరావతిలో రెండవ ఏడాదే ఉద్యోగుల రావడం జరిగింది. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్,వేగవంతంగా సిటీసెంట్రిక్ ప్లానింగ్ పూర్తి.ట్రాన్సిట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ 7నెలల్లోనే పూర్తి చేసి ప్రజల వద్దకే పాలన చేరువ చేశాం. 45ఎకరాల విస్తీర్ణంలో 6లక్షల చ.అ. భవనాల నిర్మాణం జరిగింది. 5వేలమంది ఉద్యోగులు ఇప్పటికే ఇక్కడనుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.4 సెషన్స్ అసెంబ్లీ,కౌన్సిల్ ఇక్కడినుంచే నిర్వహించారు" అని చంద్రబాబు అన్నారు.