ఈసీ తీరుపై మరోసారి సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఎన్నికల కోడ్ సడలించాలని ఈసీకి లేఖ రాస్తే ఇంత వరకు స్పందన లేదన్నారు. విపత్తులు ఎదురైనప్పుడు అత్యవసర సందర్భాల్లోనైనా వారు స్పందించాలని కోరారు. వ్యవస్థల మధ్య ఘర్షణ వైఖరి రాకూడదన్న ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నానని తెలిపారు. ఈసీ ఇప్పటికే మితిమీరిన జోక్యం చేసుకుంటోందని ధ్వజమెత్తారు. అధికారులు ఒక బృందంగా ఉంటూ సమర్ధంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. కానీ అధికారుల్లో చీలిక తేవాలని విపక్షం పన్నాగం పన్నుతోందని విమర్శించారు. దానికి తాను కారణం కాకూడదనే అన్నీ సహిస్తున్నానని చెప్పారు. అధికారులు ఎవరికి జవాబుదారీగా ఉండాలి.. ఎవరి పర్యవేక్షణలో ఉండాలి?, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికా? లేక ఎన్నికల సంఘానికా? అని అడిగారు.
తుఫాన్ సహాయక చర్యల కోసం కొత్తగా జీవోలు అక్కర్లేదన్నారు. మళ్లీ వాటికోసం ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని పేర్కొన్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో జారీ చేసిన ఆదేశాలనే ఇప్పుడు అనుసరించవచ్చని స్పష్టంచేశారు. అవసరమైతే తానే క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వస్తానని వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో పసిపిల్లలకు పాలు అందుబాటులో ఉంచాలన్నారు. టెట్రా పాల ప్యాకెట్లను సరఫరా చేయాలని సూచించారు. తుఫాన్ ప్రాంతాలకు అవసరమైన మేర పశు దాణా తరలించాలన్నారు. క్రేన్లు, విద్యుత్, టెలిఫోన్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.
బంగాళాగాతంలో అతితీవ్ర తుపానుగా మారిన ‘ఫొనీ’ ప్రభావంపై ఆర్టీజీఎస్ ద్వారా అనుక్షణం సమీక్షిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళంలో గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి తూర్పు ఆగ్నేయం దిశగా 200 కిలో మీటర్ల దూరంలో కేంద్రీ కృతమైన ‘ఫొనీ’ గంటకు 19 కి.మీ వేగంతో పయనిస్తోందని, ఈరోజు, రేపు ఈ ‘రెడ్ అలర్ట్’ కొనసాగుతుందని అన్నారు. విజయనగరం తీర ప్రాంత మండలాల్లో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రేపు ఉదయం 10 గంటలకు ఒడిశాలోని పూరీ వద్ద ‘ఫొనీ’ తుపాను తీరం దాటనుందని, దీని వల్ల ఈ రోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు తీవ్ర ప్రభావం ఉంటుందని, దీనిపై ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని ఆర్టీజీఎస్ ద్వారా అప్రమత్తం చేసిన్టు తెలిపారు.