మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఎన్నో పనులు చేసినా, డబ్బులు లేకపోయినా, అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించినా, ఆయన ఎప్పుడూ చూడని ఓటమి చూడాల్సి వచ్చింది. దీని పై అనేక వాదనలు కూడా నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం, అవేమి కాకుండా, నిజంగా తప్పు ఎక్కడ జరిగింది అనేదాని పై సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు గుంటూరు పార్టీ ఆఫీస్ లో, వేమూరు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం వారు ఎదుర్కుంటున్న సమస్యలు, వైసీపీ బెదిరింపులు, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టటం, సంక్షేమ కార్యక్రమాలు ఆపెయ్యటం, ఇలా అన్ని సమస్యలు కార్యకర్తలు చంద్రబాబుతో చెప్పుకున్నారు.
తరువాత చంద్రబాబు ప్రసంగిస్తూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రెండు నెలల్లోనే మొత్తం అస్తవ్యస్తం చేసిందని చంద్రబాబు అన్నారు. మన హయంలో ఇసుక దోపిడీ చేసాం అంటూ, ఊరు ఊరు తిరిగి విష ప్రచారం చేసారని, అయితే ఇప్పుడు ఇసుక ఎలా ఉందొ చూసారు కదా, మన హయంలో ఇసుక ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని రెట్లు పెరిగింది ? ఎవరిదీ దోపిడీ అని చంద్రబాబు ప్రశ్నించారు. అలాగే రైతు రుణ మాఫీ సగంలో ఉందని, మనం డబ్బులు బ్యాంక్ లు వేసి, వెయ్యమంటే, ఎలక్షన్ కమిషన్ చేత ఆపించారని, అవి విడుదల చెయ్యాలని కోరారు. అవి విడుదల చెయ్యకపోతే ఉద్యమం చేస్తామని, కోర్ట్ కు వెళ్తామని చంద్రబాబు అన్నారు. అప్పట్లో ప్రభుత్వం తరుపున రైతులకు ఇచ్చిన బాండ్లను చంద్రబాబు ప్రస్తావించారు.
అయితే ఈ సందర్భంలో ఒక కార్యకర్త మాట్లాడుతూ, "సార్.. మీరు రాష్ట్రం కోసం గత 5 ఏళ్ళలో ఎంతో చేసారు, అయినా ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఇంకా ఎందుకు సార్ వాళ్ళ కోసం తాపత్రయం, పార్టీని చూసుకోండి చాలు" అని అనగా, చంద్రబాబు ఆ వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు. నేను అలా ఎప్పుడూ అనుకోను, ప్రజల కోసం మనం పని చేస్తూనే ఉండాలి. వాళ్ళు నా కష్టాన్ని కూడా గుర్తుంచుకోకుండా, నన్ను ఓడించారని బాధ లేదు, వాళ్ళ కోసం ప్రతిపక్షంలో ఉండి పోరాడే తత్త్వం నాది అని అన్నారు. వైసిపీ నేతలు ఎన్ని అవమానాలు చేసినా, ప్రజల కోసమే భారిస్తున్నాని అన్నారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా ఇంకా ఆ ఓటమి నుంచి బయటకు రావాలని, ప్రజలకు అండగా ఉండే కార్యక్రమాలు చెయ్యాలని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం కొత్త కాదు, ప్రజల కోసం నిరనతరం పని చెయ్యాలని చంద్రబాబు అన్నారు.