ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఉన్న ఎంపీలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఎంపీలు ఎవరూ ఇప్పుడే రాష్ట్రానికి రావద్దు అని, మరి కొన్ని రోజులు దిల్లీలోనే ఉండాలని ఆదేశించారు... తదుపరి కార్యాచరణను మధ్యాహ్నం తర్వాత ఖరారు చేయనున్నట్లు చెప్పారు... ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డప్పటికీ ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించటం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.. ఏమన్నా నిరసనలు కోసమే అక్కడ ఉండమని చెప్పరా ? లేక ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నట్టు, అన్ని విపక్ష పార్టీలు ఏమన్నా ప్లాన్ చేస్తున్నాయా అనేది తెలియాల్సి ఉంది...
మరో పక్క, రాష్ట్రపతిని కలిసి, జరుగుతున్న పరిణామాలు వివరించాలి అని ప్రయత్నిస్తున్నా, ఆయన అప్పాయింట్మెంట్ దొరకటం లేదని తెలుస్తుంది... రాష్ట్రపతి అప్పాయింట్మెంట్ కోసం కూడా, తెలుగుదేశం ఎంపీలు ప్రయత్నిస్తున్నారు.. కేంద్రంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసంపై ఎటువంటి చర్చ లేకుండా పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిన్న టీడీపీ ఎంపీలు పార్లమెంటు నుంచి బయటకు రాకుండా లోపలే ఉండి ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉండగా ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉండాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు...
మరో పక్క, అమరావతిలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరగనుంది... ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు శనివారం మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో మార్చి 27వ తేదీన ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అధికార టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ఆద్మీ పార్టీలతో పాటు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సారి వామపక్షాలు కూడా అఖిలపక్షానికి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. సమావేశానికి రావాలని సీఎంవో పార్టీలను ఆహ్వానించగా... తమ పార్టీ రావడం లేదని బీజేపీనేత విష్ణుకుమార్ రాజు చెప్పారు. వైసీపీ కూడా హాజరు కావడం లేదని ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ఇక జనసేన అధినేత పవన్‌దీ అదే దారి. తాము భేటీకి రావడం లేదని లెఫ్ట్ నేతలు సీఎంకు లేఖ రాశారు.