‘మీకు నేను కావాలా.. కేసీఆర్ కావాలా’ అని నవ్యాంధ్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వైసీపీకి కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ‘రాష్ట్రంలో ఎన్నికల కోసం వైఎస్ జగన్‌కు ఇప్పటికే వెయ్యి కోట్లు పంపించేశారు. కేసీఆర్ సంపాదించిన సొమ్మును మన రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? నీకో సామంతరాజ్యం కావాలి. ఆంధ్రను సామంతరాజ్యంగా ఏలాలి. ఇది కేసీఆర్ కోరిక. కానీ మన ఐదు కోట్ల మంది ప్రజలకు ఆత్మాభిమానం ఉంది. మేమేంటో చూపిస్తాం. జగన్‌కు వెయ్యికోట్లు ఇవ్వడం.. నన్ను ఓడించడమే కేసీఆర్ నాకిచ్చే రిటర్న్ గిఫ్ట్. దానికి తిరుగుటపాలో జగన్ ఓటమిని పంపిస్తాం. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంఽధించిన అంశం. నీ కేసుల కోసం నువ్వు.. స్వార్థం కోసం కేసీఆర్ ఏదైనా చేస్తే ఖబడ్దార్..’ అని హెచ్చరించారు.
ఐదేళ్లపాటు సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందించామని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి 720 అవార్డులు వచ్చాయన్నారు. విభజన కష్టాలున్నా ముందుకెళ్తున్నామని ఆయన వివరించారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. వైకాపా అధ్యక్షుడు జగన్..శాసనసభకు రారు.. భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా ఉండదు. విభజన హామీలు నెరవేర్చాలని కోరితే మాపైనే దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో పదేళ్లపాటు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. తాగునీరు, సాగునీరు, విద్యుత్ కోసం ఇబ్బందులు పడ్డాం. తెదేపా అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.24,500 కోట్ల రుణమాఫీ చేశాం. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సాయం చేశాం. దేశంలో ఎక్కడాలేని విధంగా మౌలిక వసతులు కల్పించాం’’ అని చంద్రబాబు చెప్పారు.
‘‘ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రా వాళ్ల పాలన కావాలా అని అడిగారు. అలాంటప్పుడు ఏపీలో తెలంగాణ పాలన కావాలా? ఏపీ ప్రజలు తెలివైన వాళ్లు. తెరాసకు ఊడిగం చేసే జగన్‌కు ఓటేయాలా? కులం, మతం, ప్రాంతాలను రెచ్చగొడుతున్నారు. ఎంతో కష్టపడి సంపద సృష్టించాం.. దాంతో సమకూరిన ఆదాయాన్ని పంపిణీ చేస్తున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయాలి. ఈ విషయంలో కేసీఆర్‌ను జగన్ ఒప్పించాలి’’ అని సీఎం అన్నారు.