ఏపి ప్రభుత్వం నూతనంగా అమలులోకి తెస్తున్న నిరుద్యోగ భృతి పథకానికి తన పేరు పెట్టాలన్న మంత్రుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించారు. ఈ పథకానికి ఏ పేరుపెట్టాలన్న విషయమై కేబినెట్లో విస్తృత చర్చ జరిగింది. ఈ పథకానికి 'యువ నేస్తం' అనే పేరును మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించగా... 'చంద్రన్న యువ నేస్తం' అని పెట్టాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. అయితే ప్రతి కార్యక్రమానికీ తన పేరు పెట్టడం సరికాదని, ఆ అవసరం లేదని సీఎం చంద్రబాబు ఆ ప్రతిపాదనను నిర్దంద్వంగా తోసిపుచ్చారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్ల కు కేబినెట్ ఓకే చెప్పింది.
నిరుద్యోగ భృతి పై ఎంతో కసరత్తు జరిగింది. నిరుద్యోగులు తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందేందుకు... పరిశ్రమ వర్గాలు తమకు అవసరమైన వారిని ఎంచుకునేందుకు.. మూడు సేవలు, ఒకే పోర్టల్ లో రానున్నాయి. ఈ పోర్టల్ రూపకల్పనలో ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ కీలకపాత్ర పోషించారు. పలు శాఖలు, విభాగాలు, కార్పొరేషన్లు, నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు అనేక సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు సమీక్షించారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పోర్టల్‌ను అత్యంత పకడ్బందీగా తయారీకి లోకే శ్ సుమారు 600 గంటలు శ్రమించారు. నిరుద్యోగ భృతి కోరే యువతీ యువకులు దీనికి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. వారికి ఒక ఓటీపీ నంబరు వస్తుంది. అది ఎంటర్ చేసి.. ఇదే వెబ్‌పోర్టల్‌లోనే దరఖాస్తు నింపాలి. పాలిటెక్నిక్, డిగ్రీ సమానార్హత ఉండి... 22 నుంచి 35ఏళ్ల మధ్య వయసున్న వారే దీనికి అర్హులు. అర్హత లేకపోతే అప్పటికప్పుడే ‘రిజెక్ట్’ చేస్తారు. అన్నీ ఓకే అయితే... అప్పటికప్పుడే భృతిని మంజూరు చేస్తారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో క్రమం తప్పకుండా ఉద్యోగ ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. వీటికి సంబంధించిన జాబ్ పోర్టల్‌ను కూడా నిరుద్యోగ భృతి వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తారు. ఎక్కడ ఎలాంటి కొలువుల ప్రకటనలు వెలువడినా దీని ద్వారా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ కోసం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పలు శాఖల్లోని పథకాలు, కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు కసరత్తు చేశారు. దీనికోసం ఆయా శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతోపాటు సంబంధిత మంత్రులతోనూ పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ప్రకటించి, దానిని విజయవంతంగా అమలు చేయలేని రాష్ట్రాల అనుభవాలను తెలుసుకున్నారు. లోటుపాట్లను ముందుగానే గుర్తించారు. అలాంటి పొరపాట్లు ఇక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.