రేపటి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా హీట్ పెంచుతుంది. తెలుగు మీడియానే కాక, జాతీయ మీడియా కూడా చంద్రబాబు పర్యటన పై ఆసక్తి చూపిస్తుంది. ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి గుచ్చుడు దాడి నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇప్పటికే చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కెసిఆర్, దగ్గర నుంచి బీజేపీ, పవన్, గవర్నర్ దాడి చేస్తున్నాయి. దీంతో పూర్తి క్లారిటీ వచ్చిన చంద్రబాబు, ఇక ఉపేక్షించేది లేదని, నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కేంద్రం పై డైరెక్ట్ అటాక్ కి రంగం సిద్ధం చేసారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు... రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ’.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమై వెళ్తున్నారు. మరోవైపు శనివారం ఉదయం 10 గంటల కల్లా టీడీపీ ఎంపీలంతా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముందుగా ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఐటీ దాడులు, జగన్పై దాడి ఘటన, కేంద్రం సహాయ నిరాకరణపై టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడనున్నారు. జాతీయ మీడియాతో జరిగే సమావేశంలో చంద్రబాబు.. గవర్నర్ వ్యవస్థపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో వేలు పెడుతున్నారంటూ చంద్రబాబు నిన్ననే మండిపడ్డారు. గవర్నర్.. ఏపీ డీజీపీకి ఫోన్ చేసి జగన్పై జరిగిన దాడిపై నివేదిక అడిగిన నేపథ్యంలో చంద్రబాబు కన్నెర్ర జేశారు. మరో పక్క రాష్ట్రంలో, మోడీ - షా లు ఆడుతున్న వికృత క్రీడని కూడా దేశం ముందు ఉంచనున్నారు. ఇప్పటికే ఏపికి జరిగిన నష్టాన్ని, దేశం ముందు ఉంచటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అవిశ్వాస తీర్మానం పెట్టటం, జాతీయ స్థాయి నాయకులని కలవటం, ఢిల్లీలో ప్రెస్ మీట్ లు పెట్టి, మోడీ-షాలని ఏకి పారేసి, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశానికి చెప్పారు. ఇప్పుడు దీని తరువత రాష్ట్రాన్ని ఎలా ఇబ్బంది పెడుతుంది, ఐటి దాడులతో భయబ్రాంతులకి గురి చెయ్యటం, అనేక రకాల కుట్రలు చెయ్యటం, గవర్నర్ ని ఇందులో వాడటం, జగన్, పవన్ పాత్రలు, ఇవన్నీ చెప్పి, మరోసారి కేంద్రం పై దాడి చెయ్యనున్నారు.