అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని వైకాపా ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన తెదేపా రాష్ట్రస్థాయి కార్యశాలలో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... వైకాపా పోరాడలేక పారిపోయిన పార్టీ, అసెంబ్లీకి రానివారు ఎమ్మెల్యేలుగా ఉండటం ఎందుకు అని ప్రశ్నించారు. బాధ్యత మరిచిన వైకాపా ఎమ్మెల్యేలు.. జీతాలు తీసుకోవడం మరువలేదని విమర్శించారు. కేంద్రం ఏపీకి నిధులివ్వకపోగా..పీడీ అకౌంట్లపై విమర్శలు చేస్తోంది.. కేంద్రం విమర్శలకు గట్టిగా సమాధానం ఇవ్వాలి. కేంద్రంతో సఖ్యతగా ఉంటే అన్నీఆమోదిస్తున్నారు. ఏపీ విషయంలో మాత్రం కేంద్రం కక్ష గట్టినట్టు వ్యవహరిస్తోంది’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
"తెలుగుదేశం పార్టీలో మొదటి ప్రాధాన్యత బిసిలకే. పదవుల్లో,సంక్షేమంలో,అభ్యున్నతిలో బిసిలకే పెద్దపీట. టిడిపి చేస్తున్న అన్ని పనుల్లో తొలి తాంబూలం బిసిలకే. పేదల పార్టీ తెలుగుదేశం. పేదరికంలేని,ఆర్ధిక అసమానతలు లేని సమాజం ఏర్పాటే టిడిపి లక్ష్యం. క్రమశిక్షణ లేని పార్టీ, కట్టుబాటులేని కుటుంబం,క్రమశిక్షణ లేని వ్యవస్థ కుప్పకూలుతుంది. ఎంతమంది ఉన్నారు అనేదికాదు ఎంత ఐక్యంగా ఉన్నారు అనేది ముఖ్యం. మన కర్రతో మనల్ని కొట్టుకుంటే దెబ్బతగుల్తుందా లేదా..? రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి.కానీ రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు బహిర్గతం కారాదు.మన కాళ్లకు మనమే బంధాలు వేసుకుంటే ముందుకు పోలేం. ఎన్నికల ముందు అందరూ సంఘటితంగా ఉండాలి. గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి." అని చంద్రబాబు అన్నారు.
కేంద్రంపై ధర్మ పోరాటం కొనసాగుతోందని మరోసారి స్పష్టం చేశారు. పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని, యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. కేంద్రం తెలంగాణకు సంబంధించిన బిల్లులు నాలుగురోజుల్లోనే పాస్ చేసిందని, ఏపీ విషయాన్ని వచ్చేసరికి కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘నాలుగేళ్లల్లో సగటున 10.5 శాతం వృద్ధిరేటు సాధించాం. ప్రతి సంవత్సరం రెండంకెల వృద్ధిరేటు సాధించిన రాష్ట్రం ఏపీనే. చంద్రన్న భీమా, అన్న క్యాంటిన్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 300 అన్న క్యాంటిన్లు పెడతాం. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభిస్తాం. అమ్మాయి ఆర్ధిక పరిస్ధితుల ప్రాతిపదికన పెళ్ళికానుక ఇస్తాం. రాష్ట్రంలో డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకోవాలి అని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.