‘రాష్ట్ర ప్రజలకు మీరు ఏదైనా చేస్తే చెప్పుకోండి. అంతే తప్ప నమ్మక ద్రోహం చేసి నా పైనే అవినీతి విమర్శలు చేస్తే సహించేది లేదు. నన్ను విమర్శించే నైతికత ఎన్డీయే, బీజేపీ నేతలకు లేదు. మా అబ్బాయిని సీఎం చేస్తానని ఎప్పుడైనా అమిత్ షాకు చెప్పానా? నీ కొడుకు అక్రమ వ్యాపారాలు చేస్తుంటే విచా రణ జరపరు కాని నన్ను విమర్శిస్తారా? ఇదే పరిస్థితి కొనసాగితే పలాస పరాభవమే అన్ని చోట్లా జరుగుతుంది’ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. భార్యనే చూడని వాడు దేశానికి ఏం చేస్తాడంటూ బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా సభలో ఉదహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోడీ ఇక దేశానికి ఏం చేస్తాడు అంటూ ఎద్దేవా చేశారు.
రైల్వేజోన్ ఇస్తామంటే విశాఖ ప్రజలు ఒక పార్లమెంటు, శాసనసభ్యుడిని కూడా గెలిపించారు. ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు విష్ణుకుమార్ రాజు తదితరులు రాజీనామా చేస్తే తానే అభినందించేవాడినని చెబుతూ ప్రజల కోసం ఉండండి తప్ప పార్టీల కోసం కాదంటూ ముఖ్యమంత్రి హితవు పలికారు. శాసనసభలో మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధిపై జరిగిన లఘు చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పలాస సభలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలుగుజాతి న్యాయం కోసం పోరాడుతున్నానే తప్ప యు టర్న్ తీసుకోలేదని, బీజేపీ పార్టీనే అనేక వంకర టర్న్‌లు తీసుకుందని ఆయన అన్నారు. మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కానున్నారంటూ అమిత్ షా చెప్పడంపై స్పందిస్తూ, ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
2014లో స్వయంగా మోడీ హైదరాబాద్ వచ్చి ప్రత్యేక హోదా, విభజన హామీలపై నిర్థిష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే బీజేపీతో కలిశాను తప్ప తనంత తానుగా వెళ్లి కలవలేదన్నారు. నాలుగేళ్ల పాటు ఎదురుచూసినప్పటికీ నమ్మక ద్రోహం చేసిన మోడీ, అమిత్ షాలు తనపై ఎదురుదాడి చేస్తున్నారని, ఎంత ఒత్తిడి పెంచితే అంత పతనం తప్ప దని ఆయన హెచ్చరించారు. తన పరిధిలో అగ్రిగోల్డ్ మోసంపై కేసులు పెట్టి నిందితులను జైలుకు పంపడంతో పాటు ఆస్తులను సీజ్ చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్నానన్నారు. మరి మోడీ రాఫెల్ స్కాంపై విచారణ ఎందుకు చేయడం లేదని, బ్యాంకుల సొమ్మును కొల్ల గొట్టిన నిందితులు దేశం విడిచి ఎలా పరార య్యారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.