కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ఒక పక్క ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేయబోయే పోరాటం చెప్తూనే, తండ్రిలా మందలించారు... చిత్తశుద్ధితో మీ కోసం ప్రయత్నం చేస్తుంటే అల్లరి చేస్తారా? ఎంసీఐ, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంటే కనపడటంలేదా? అని విద్యార్థులను ప్రశ్నించారు. టవర్ ఎక్కి చనిపోతామని బెదిరిస్తారా అంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. మీకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని విద్యార్థులకు చంద్రబాబు చెప్పారు. టవర్ ఎక్కినప్పుడు ఏదన్నా జరగరానిది జరిగితే, మీ తల్లి తండ్రులు ఎమైపోతారు... చదువుకున్న మీరు ఇలా చెయ్యొచ్చా... మీకు బాధ ఉంది అని తెలుసు, కాని సెల్ టవర్ ఎక్కి చనిపోతాం అనటం పరిష్కరామా అంటూ, క్లాసు తీసుకున్నారు..
సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోందని, తనను కలిసిన బాధిత విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి ఈమేరకు హామీ ఇచ్చారు. ఈ సమస్య జఠిలమైందని దీనిపై సంయమనం, సహనం పాటించాలని సూచించారు. విద్యార్ధులకు ఉపశమనం లభించేలా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బాధిత విద్యార్ధుల్లో ఇప్పటికే నీట్ అర్హత పొందినవారికి ఫాతిమా కళాశాలలో కానీ, మరే ఇతర కళాశాలలో అయినా సీటు పొందేలా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు అనుమతికి ప్రయత్నిస్తామని అన్నారు.
నీట్ అర్హత సాధించని మిగిలిన విద్యార్ధులు వచ్చే విద్యాసంవత్సరానికి అయినా అర్హత పొందేందుకు అవసరమయ్యే కోచింగ్ అందిస్తామని, ఇందుకయ్యే వ్యయాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలిపారు.
సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా కొందరు విద్యార్ధులు కమిటీగా ఏర్పడాలని ముఖ్యమంత్రి సూచించారు. కాల్ సెంటర్ ద్వారా బాధిత విద్యార్ధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, అధికారులు, విద్యార్ధులు కలిసి ఢిల్లీ వెళ్లి సమస్యను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్దేశించారు.