పచ్చని ఉద్దానంపై ప్రకృతి పగపట్టినట్లు సృష్టించిన విధ్వంసం చూసి... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చలించిపోయారు! విద్యుత్తు సరఫరా పనులు కొలిక్కివచ్చే వరకూ.. జన జీవనం సాధారణ స్థాయికి చేరే వరకూ.. జిల్లాలోనే ఉంటానని ప్రజలకు అభయం ఇచ్చారు! జిల్లాలో ‘తిత్లీ’ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు...వారి కష్టాలను ఆలకించారు! పునరుద్ధరణ పనులు ఎలా పరుగులు తీయించాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు!! శుక్రవారం పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ప్రజా సమస్యలు ఆలకించారు.
తిత్లీ తుపాను తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఆయా గ్రామాల వద్ద బాధితులను ఓదార్చుతూ.. నష్టనివారణ చర్యలు, సహాయక పనుల తీరుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తూ ముందుకువెళ్లారు. తుపాను తీరం దాటిన ప్రాంతం ఎలా రూపురేఖలు కోల్పోయిందో ప్రత్యక్షంగా వీక్షించారు. నేలకూలడాన్ని జీడి, కొబ్బరి, ఇతర భారీ వృక్షాలను పరిశీలించారు. తోటలకు తోటలు ఊడ్చుకుపోవడాన్ని గమనించి, మోడివారిన చెట్లనూ చూసి ఎంత కష్టం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటిపర్యంతమవుతున్న ప్రజలకు ధైర్యం చెబుతూ ముందుకునడిచారు. అధికారులు ఎప్పటికప్పుడు సత్వర పనులు చేపట్టి ఆదుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోనే ఉండాలని ఆదేశించారు.
ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలంటూ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం తిత్లీ ప్రభావిత ప్రాంతాలైన పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో పర్యటించారు. హెలీకాప్టర్‌లో కాశీబుగ్గకు ఉదయం 11.30 గంటలకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి వరకు వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి పలాస చేరుకున్నారు. బీ కాశీబుగ్గలోని డీఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి దిగిన సీఎం అక్కడకు చేరుకున్న కొందరు మహిళలతో మాట్లాడారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యనారాయణ, ఎంపీ రామ్మోహన్ నాయుడులతో మాట్లాడారు. కాన్వాయ్ ఆలస్యం కావడంతో 15 నిమిషాల పాటు కారులోనే కూర్చున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో తుపాను ప్రభావం గురించి సీఎంకు ఎంపీ వివరించారు.