‘నువ్వు సీఎంను కలవడమేంటి? ఆయన అవార్డు ఇవ్వడమేంటి’? అంటూ ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన శివజ్యోత్స్న తల్లిదండ్రులు హేళనగా అన్న మాటలకు బాలిక లోలోపల కుంగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి నుంచి అవార్డు తీసుకునే సమయంలో ఆమె బాధ కన్నీటిరూపంలో పెల్లుబుకింది. ఆంగ్లంలో ప్రసంగం అదరగొట్టింది. అందరి మన్ననలు పొందింది. లోలోపల ఆవేదనను అణచుకుంది. ఉప్పొంగుతున్న ఉద్వేగాన్ని ఆపలేకపోయింది. అవార్డు తీసుకుంటూనే సీఎంకు తనలోని బాధను వెల్లడించింది. చిత్తూరులోని ఆదిశంకర పాఠశాలకు చెందిన విద్యార్థిని జయకృతిక పురస్కారం అందుకున్న వేళ.. తనకు వైద్యురాలిని కావాలని ఉందని, కానీ ఆర్థిక స్థోమత లేదని ఉద్వేగంగా చెప్పింది. దీని పై స్పందించిన ముఖ్యమంత్రి నీకు అండగా ఉంటానంటూ ఊరడించారు.
పుత్తూరు మండలం పైడిపల్లెకు చెందిన ఓ పేద కర్షకుడి కూతురు కోరిన కోరికను నెరవేర్చుతానని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని సోమవారం ఒంగోలులో జరిగిన ‘ప్రతిభ’ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టెన్త్ పరీక్షల్లో పదికి పది పాయింట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ అవార్డులు ఇచ్చింది. ఈ సందర్భంగా పైడిపల్లెకు చెందిన కృతిక ప్రతిభా అవార్డు స్వీకరించిన సందర్భంలో సీఎం చంద్రబాబుకు తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించింది. తనకు డాక్టర్ కావాలని ఉందని, అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి చదువు కొనసాగించేలా లేదని కన్నీటితో వివరించింది.
చిన్న రైతు అయిన తన తండ్రి లాభసాటి కాకపోవడంతో వ్యవసాయం మానేసి రెండు ఆవులు పట్టుకుని పాల అమ్మకంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడంది. తన అక్క ఇంజనీరు కావాలన్న పట్టుదలతో పదికి పది మార్కులు సంపాదించి చదువుతోందని, తనకు కూడా పదికి పది వచ్చాయని, అయితే ఏం చేయాలో తెలియడం లేదంది. మీరే ఆదుకోవాలని చంద్రబాబును కోరింది. స్పందించిన ఆయన వెంటనే చదువు కొనసాగించమని సూచించారు. తాను అండగా వుంటానంటూ భరోసా ఇచ్చారు.