తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చమన్ సాబ్ గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ రోజు, రేపు కలెక్టర్స కాన్ఫరెన్స్ ఉండటంతో, చంద్రబాబు అంత్యక్రియలకు వెళ్ళటం కుదరక, ఫోన్లో చమన్ భార్య రమీజాబీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఉదయం మాట్లాడారు. చమన్ భార్య రమేజాబీతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ఆమెను ఓదార్చారు. చమన్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా నేను ఉన్నా అంటూ చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు.. కాగా, చమన్ చిరకాలవాంఛ తెలుసుకుని, చంద్రబాబు అది తీరుస్తా అని హామీ ఇచ్చారు... చమన్ చిరకాలవాంఛ, అయిన కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ చెయ్యటం..
ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, చమన్ కుమారుడు ఉమర్ ముక్తాను ఎంబీబీఎస్ చదివిస్తానని, డాక్టర్ ను చేస్తాని, ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిటాల రవి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న చమన్ మృతిపట్ల పరిటాల అభిమానులు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. చమన్ ప్రస్థానం గీత కార్మికుడిగా మొదలైంది. పరిటాల రవితో పరిచయం.. 1993లో రవి తెదేపాలో చేరడంతో నాటి నుంచి చమన్ కూడా ఆయన వెంట నడిచారు. రవీంద్ర అనుచరుడిగా పెనుకొండ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పునర్విభజనకు ముందు పెనుకొండ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిటాల వర్గీయులపై దాడులు మొదలవడంతో రవి సూచనతో అజ్ఞాతంలోకి వెళ్లారు. రవి ప్రధాన ప్రత్యర్థి మద్దలచెరువు సూరి హత్య తర్వాత పరిణామాలు మారిపోవడంతో 2012లో అజ్ఞాతం నుంచి చమన్ బయటకు వచ్చారు.
సోమవారం రామగిరి మండలం వెంకటాపురంలో సొమ్ముసిల్లి కుప్పకూలిన చమన్‌ను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్సలు చేస్తుండగానే చమన్ తుది శ్వాస వదిలారు. గుండెపోటు రావడంతోనే ఆయన మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. చమన్ మరణవార్త వినగానే మంత్రి పరిటాల సునీత విలపిస్తూ కుమారుడు శ్రీరామ్ చేతుల మీద సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న వైద్యులు హుటాహుటిన ఆమెకు చికిత్సలు అందజేశారు. అనంతరం మంత్రిని కలెక్టర్, డీఐజీ, ప్రజాప్రతినిధులు పరామర్శించారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత చమన్ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం రామగిరి మండలం ఆర్.కొత్తపల్లికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.