మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావును కుశల ప్రశ్నలు వేసి ఆరోగ్య సమాచారాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా డిసెంబరు 16 న జరిగే వందో జన్మదిన వేడుకలకు రావాల్సిందిగా సి ఎం చంద్రబాబును యడ్లపాటి వెంకట్రావు ఆహ్వానించారు. తనకున్న సమాచారం ప్రకారం మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే వస్తారని ప్రజల ఆశీర్వాదం ఉందని యడ్లపాటి , సి ఎం ను ఆశీర్వదించారు. యడ్లపాటితోపాటు ఆయన బంధువులు ఎస్. వెంకట కోటేశ్వరరావు , సుదీర్ బాబు, వంశీలు కూడా ముఖ్యమంత్రిని కలిసారు.
‘పెద్దాయనా! మీ ఆరోగ్యం ఎట్లా ఉంది? ఈ వయస్సులోకూడా పార్టీకోసం మీరు చూపిస్తున్న తపన, శ్రమ మర్చిపోలేం. మీ వంటి నిస్వార్థ నాయకులు నేటి యువతకు ఆదర్శంగా ఉండాలి. మీ 100వ పుట్టిన రోజు వేడుకలకు తప్పనిసరిగా రావాలనుకుంటున్నా. మీ ఆశీర్వచనాలు మా అందరికీ ఉండాలి..’ అంటూ ఆప్యాయతను కురిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. యడ్లపాటికి ముఖ్యమంత్రి ఎదురొచ్చి ఆప్యాయంగా పలకరించారు. కుశల సమాచారం అడిగి తెలుసుకున్నారు. 100 సంవత్సరాల్లోకి అడుగుపెడుతూ కూడా ఇంత ఉత్సాహంగా ఎట్లా ఉంటున్నారంటూ ప్రశ్నించారని అడిగారు.
మీ ఉత్సాహం నేటి యువతలోనూ ఉండాలని, పార్టీనే మీకు రుణపడి ఉంటుందని చెప్పారు. మర్యాదపూర్వకంగా కలిసేందుకే వెళ్లినా, డిసెంబర్ 16న జరుపుకోనున్న 100వ జన్మదిన వేడుకలకు రావాలని కూడా ముఖ్యమంత్రిని కోరానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని యడ్లపాటి పేర్కొన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా మీరే వస్తారనే నమ్మకం నాకుందని, రాష్ట్రానికి మీ నాయకత్వం అవసరమని జనం నమ్ముతున్నారని ముఖ్యమంత్రితో అన్నానని, ఆయన తన ఆశీర్వచనాలు తీసుకున్నారని చెప్పారు. యడ్లపాటితోపాటు ఎస్.వెంకటకోటేశ్వరరావు, సుధీర్‌బాబు, వంశీలు ఉన్నారు.