రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అపూర్వ ప్రసంశలు లభించాయి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రను ఆర్థికంగా పునర్నిర్మించడానికి ఆయన బృహత్తర ప్రణాళికను రూపొందించారని అస్ట్రేలియా ప్రభుత్వం కితాబునిచ్చింది. ‘2035 నాటికి భారత్‌తో ఆర్థిక వ్యూహం’ పేరిట ఆ దేశం రూపొందించిన నివేదికలో భారత్‌లోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల గురించి వివరించింది. ఆ నివేదికలో చంద్రబాబు పేరును ప్రముఖంగా ప్రస్తావించింది. ఆయన పేరు మినహా మరే రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు అందులో లేకపోవడం గమనార్హం. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి విప్లవాత్మకంగా విధానపర సంస్కరణలు చేస్తున్నారని, నూతన ఆవిష్కరణలకు ఆయన పెద్దపీట వేస్తున్నారని కొనియాడింది.
‘1994-2004 మధ్య హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన చంద్రబాబు... అదే ఉత్సాహం, అంకితభావంతో రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కీర్తించింది. అత్యధిక తలసరి ఆదాయం ఉన్న విశాఖపట్టణాన్ని ఫిన్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిపింది. నూతన రాజధాని నిర్మాణం పెద్దపెద్ద విదేశీ పెట్టుబడిదారులను సైతం ఆకర్షించిందని, ఆస్ట్రేలియన్ మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి సంస్థలకు అవకాశాలు కల్పించిందని పేర్కొంది. ఏపీ వనరులు, విద్యుత్ రంగం... ఆస్ట్రేలియా మైనింగ్, ఎంటీఈఎస్, పునరుత్పాదక శక్తి సాంకేతికతతో సరితూగుతాయని స్పష్టం చేసింది.
సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌స)లో ఏపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని, గత మూడేళ్లలో రాష్ట్ర జీఎస్డీపీ ఏటా 11శాతానికిపైగా వృద్ధి చెందుతోందని వివరించింది. కాగా, ఏపీతో పాటు దేశంలోని మరో తొమ్మిది రాష్ట్రాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. మైనింగ్, మైనింగ్ సేవలు, విద్య, డ్రై లాండ్, వ్యవసాయం, విద్యుదుత్పత్తి- పంపిణీ, నీరు, రోడ్డు భద్రత, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో సిస్టర్ స్టేట్ సంబంధాన్ని ఏర్పర్చుకుంది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థల్లో బలమైన పోటీ నెలకొంది. పూర్తి నివేదిక ఇక్కడ చూడవచ్చు http://dfat.gov.au/geo/india/ies/pdf/dfat-an-india-economic-strategy-to-2035.pdf#page76