విజయనగరం జిల్లాలో టీడీపీ ప్రజాదర్బార్ సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ వృద్ధురాలికి సీఎం చంద్రబాబు పాదాభివందనం చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రసంగం ముగియగానే సభావేదికపై నుంచి కిందకి నడుచుకుంటూ వెళుతుండగా.. పెంటమ్మ అనే వృద్ధురాలు స్టేజిపైకి వచ్చారు. ‘‘చంద్రబాబునాయుడికి ఓటు వెయ్యండి.. దొంగను నమ్మకండి.. బాబు చేసిన మేలును మరిచిపోవద్దు’’ అంటూ పిలుపునిచ్చారు. ఆ వృద్ధురాలి మాటలకు మురిసిపోయిన చంద్రబాబు ఆమె పేరు తెలుసుకుని.. ఆమెను మాట్లాడమని మైక్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘పెంటమ్మ ఆవేశం చూశారా.. ఆ ఉద్వేగం చూశారా.. ఆమెలో రాష్ట్ర ప్రజల కసి కనపడుతుంది. ఆమె డబ్బులు కోసం రాలేదు. టీడీపీని గుర్తించమని.. ముందుకు వచ్చారు. అదీ స్ఫూర్తి. అది అందరిలో ఉండాలి. ఆ స్ఫూర్తికి పాదాభివందనం చేస్తున్నా’’ అంటూ ఆమె కాళ్లకు మొక్కారు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.
చంద్రబాబు మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేందరమోదీని టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ మిస్టర్ ప్రైమినిస్టర్ అని సంబోధించారని.. అంతే ప్రధాని ఆఫీసు నుంచి ఈడీకి ఫోన్ వెళ్లిందని.. వెంటనే జయదేవ్‌కి నోటీసులు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీ వేధింపులు ఎలా ఉంటాయో దీన్నిబట్టి అర్థమవుతుందన్నారు. పీకల్లోతు అవినీతిలో ఉన్నవాళ్లు మాత్రం.. మోదీ ఆఫీసులో కూర్చొని ఉంటారని, దీన్నిబట్టి ఎవరు కాపలాదారో అర్థమవుతోందని అన్నారు. పెత్తందారీ వ్యవస్థ కోసం రాష్ట్రంపై దాడులు చేస్తారా? అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని దెబ్బతీసేందుకు కేసీఆర్ వస్తానంటున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందితే తెలంగాణ ఎత్తిపోతుందని కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే మనల్ని దెబ్బతీసి
అభివృద్ధి చెందకుండా చూసి రాజకీయం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
ప్రజలు తమ ఓటుతో జగన్, కేసీఆర్, మోదీలకు బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉన్నవారిని బెదిరిస్తున్నారని, నోటీసులు ఇస్తున్నారని సీఎం మండిపడ్డారు. టీడీపీ జోలికొస్తే ఖబడ్దార్.. జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు. మన పని అందరినీ కలపడమేనని... జగన్ పని అందరిని చంపడమేనని చంద్రబాబు అన్నారు. బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీను రెచ్చిపోతున్నారని, తాను ఫోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొస్తే.. బొత్స అవినీతి కారణంగా ఆ కంపెనీ వెళ్లిపోయిందన్నారు. ఏమీ పనిచేయని కేసీఆర్‌కు 88 సీట్లు వస్తే... రోజూ 18 గంటలు పనిచేసే టీడీపీకి 150 సీట్లు రావాలన్నారు. లబ్ధిదారులు బాధ్యత తీసుకుని టీడీపీని గెలిపించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.