మంగళవారం ప్రధాని మోడీ ఏఎన్ఐ నేషనల్ మీడియా న్యూస్ ఏజెన్సీతో ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ లో చంద్రబాబు పై మోడీ విమర్శలు చేసారు. కేసీఆర్ ఎన్ని బూతులు తిట్టినా, ఒక్క మాట కూడా అనలేదు. అయితే మోడీ చేసిన విమర్శల పై చంద్రబాబు ఘాటుగా స్పందిస్తూ, సూపర్ ఛాలెంజ్ చేసారు. తాను కేవలం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి సీఎంనని సర్వశక్తిమంతుడ్ని అంటున్న ప్రధాని..నాతో చర్చకు రాగలరా? అని సవాల్ చేశారు. ఎవరి అభివృద్ధి విధానమేంటో దేశం ముందు ఉంచుదామని సవాల్ చేశారు. ‘మీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందో చర్చకు సిద్ధమా? కేంద్రం సాధించిన వృద్ధి రేటు ఏముంది? నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థికాభివృద్ధి ఏం సాధించారు?’ అని ప్రశ్నించారు.
తన చర్యల కారణంగా దేశ ప్రజలను మోదీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. బలహీనుల్ని అధికారంలోకి తెచ్చి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవాలన్నదే ఆయన ధ్యేయమని, సుస్థిర ప్రభుత్వం రాకూడదని, సామంత రాజులు రావాలని చూస్తున్నారని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థికంగా సుస్థిరత రాకుండా చేస్తున్నారని, తమ దృష్టి మరల్చి, తమను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారంటూ మోదీని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి విఫలమైందంటూ చేస్తున్న విమర్శలపై చంద్రబాబు స్పందించారు. తెలంగాణలో ప్రజాకూటమి విఫలం కాలేదని, విఫలమైంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ, జైట్లీలని విమర్శించారు. దేశంలో ఉంది రెండే కూటములని, అందులో ఒకటి ఎన్డీఏ.. దానికి మద్దతు పలుకుతున్న పార్టీలు కాగా, రెండోది కాంగ్రెస్, దాని పక్షాన నిలిచిన పార్టీల కూటమి అని పేర్కొన్నారు.
ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగుతున్న విషయం తనకు తెలియనది మోడీ చెప్పుకు రావడాన్ని ఖండించారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ కు సూత్రధారులు మోడీ, జైట్లీనేనన్నారు. ఫెడరల్ ఫ్రంట్లో మమతాబెనర్జీ ఉన్నారంటూ జైట్లీ ఎలా ప్రకటించారని.. ఆయనకేం సంబంధమని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందని ..దాన్ని ప్రమోట్ చేస్తోంది మోదీ, జైట్లీనేనని తేల్చేశారు. మహాకూటమి విఫలం కాలేదని స్పష్టం చేశారు. విఫలమైంది ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి జైట్లీనేనన్నారు. ఏపి హక్కుల కోసం పోరాడుతుంటే, తనది ఆక్రోశమంటూ రాజకీయా నిందలేస్తారా అని మోదీని నిలదీశారు. ప్రతిపక్షాల కూటమి విఫలమైన ఆలోచన అని, తెలంగాణ ఫలితాలే అందుకు కారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారని..విఫలమైందని కూటమి కాదని, దేశవ్యాప్తంగా రాజ్యాంగ సంస్థలను నాశనం చేస్తూ బీజేపీ విఫలమైందన్నారు.