ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి అకస్మాత్తుగా జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. కేవలం వారం రోజుల్లో ప్రతిపక్షాల సమైక్యతకు వేదికను సృష్టించటంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఆయా పార్టీలను సమైక్యపరచటంలో విజయం సాధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ప్రతిపక్షానికి చెందిన సీనియర్ నాయకులు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, సీనియర్ నాయకుడు శరద్ యాదవ్‌తోపాటు వామపక్షాలతోనూ చర్చలు జరిపి, అందరినీ ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సమైక్య పరిచేందుకు శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయత్నించినా అవి ఆశించిన ఫలితాలను సాధించలేదు.

congress 02112018 2

ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా పావులు కదిపారు. కానీ, ఆ ప్రయత్నం కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. అయితే చంద్రబాబు గత వారం రోజులుగా తెర వెనక చేసిన ప్రయత్నాలు గురువారం జాతీయ స్థాయిలో బాంబులా పేలాయి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే తమ ప్రధాన లక్ష్యమని రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు ప్రకటన చేయడం జాతీయ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. ఆయన ప్రయత్నాల మూలంగా బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఇంతకాలం రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ఇష్టపడకపోవటం తెలిసిందే. అయితే, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల మూలంగా వారు కూడా ఇతర ప్రతిపక్షాలతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

congress 02112018 3

కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ లేకుండా ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి రావటం సాధ్యం కాదంటూ చంద్రబాబు చేస్తున్న వాదనతో మాయావతి, మమతా బెనర్జీ ఏకీభవిస్తున్నట్లు చెబుతున్నారు. మూడు, నాలుగు రోజుల్లో మాయావతి, మమతా బెనర్జీ, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో చంద్రబాబు చర్చలు జరుపనున్నారు. ఆయన గత వారం ఢిల్లీకి వచ్చినప్పుడు మాయావతితో చర్చలు జరపటం తెలిసిందే. త్వరలోనే మరోసారి ఈ నాయకులతో చర్చించిన అనంతరం వచ్చే వారం, పది రోజుల్లో ఢిల్లీలో అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ఈ కీలక సమావేశం ప్రాతిపదిక అవుతుందని అంటున్నారు. గతంలో మాదిరిగానే చంద్రబాబు తాజా ప్రతిపక్ష కూటమికి జాతీయ స్థాయి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read