జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే విషయం పై చంద్రబాబు ఈ మధ్య తరుచూ మాట్లాడుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా ? ప్రధాని అయ్యే ఆశలు ఉన్నాయా అని విలేకరులు అడిగినా, పియం అంటూ టిడిపి శ్రేణులు నినాదాలు ఇచ్చినా, చంద్రబాబు ఎప్పుడూ ఇవి తోసి పుచ్చే వారు.. నాకు ప్రధాని అయ్యే ఆలోచనే లేదు అని, అసలు అలాంటి ఆశలు లేవని, రాష్ట్రమే నాకు ముఖ్యం అంటూ చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. రాష్ట్రం కోసం నేను అహర్నిశలు కష్టపడుతున్నాని, ఒక విజన్ తో, రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసే ఆలోచలనతో పనులు మొదలు పెట్టానాని, అంతటి ప్యాషన్ తో రాష్ట్రం కోసం పని చేస్తుంటే, ఇక ప్రధాని అవ్వాలి అనే ఆశ ఎలా ఉంటుంది అంటూ చంద్రబాబు ఎప్పుడూ అనే వారు. అయితే, నిన్న మాత్రం కొంచెం బిన్నంగా స్పందించారు.
‘జాతీయ రాజకీయాలపై అందరి మాదిరి కుప్పిగంతులేయలేను’ ఏపీ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. శనివారం నిర్వహించనున్న నవ నిర్మాణ దీక్షపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాలపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " జాతీయ రాజకీయాలేంటో.... అక్కడి పరిస్థితులు, పరిమితులేంటో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావడం ఖాయం. మేం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయం. జాతీయ రాజకీయాల విషయంలో ఎప్పుడేం చేస్తానో మీరే చూస్తారు. కాంగ్రెస్ ఎంత అన్యాయం చేసిందో, బీజేపీ అంత అన్యాయం చేస్తోంది, ఇంకా ఎక్కువ చేస్తుంది కూడా. విభజన హక్కుల సాధనకు చివరి ఆప్షన్‌గా న్యాయ పోరాటం చేస్తాను" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
"ఈ దేశంలో ఉన్న రాజకీయపార్టీలను అధ్యయనం చేసిన వ్యక్తిని నేను. అనేక సందర్భాల్లో వాటిల్లో భాగస్వామినయ్యాను. జాతీయ రాజకీయాల్లో సంక్లిష్ఠతలు తెలిసిన వాడిని. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నవి సాధించుకోవడం ఎలాగో నాకు తెలుసు. ప్రాంతీయ పార్టీలకు ఈ సారి ఎక్కువ సీట్లు వస్తాయి. మన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీలన్నీ మద్దతు తీసుకుని విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చమని కోరుతాం. నీతి, నిజాయతీ వ్యాఖ్యలు వల్లించిన మోదీ కర్ణాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపి బరితెగించారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. కేంద్రాన్ని విడిచిపెట్టం. సహకరించనందునే ధర్మపోరాటం చేస్తున్నాం..’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.