రాష్ట్రం కోసమే విష్ణుకుమార్ రాజును నిన్న అసెంబ్లీలో హెచ్చరించానని సీఎం చంద్రబాబు అన్నారు. మనం ఇంత ఆవేదన పడుతుంటే, ఆయాన మోడీ అన్నీ ఇచ్చేసారు అని చెప్తుంటే బాధ అనిపించి, అలా ఖటువుగా మాట్లాడానని చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్రంలో అద్భుతాలు చేసేవాడినని చెప్పారు. రోషం, కోపం ఉన్న బీజేపీకి పుట్టగతులుండవని, జనం చాటిచెప్పాలని సీఎం పిలుపునిచ్చారు. ఎన్ఐఏ రిపోర్ట్‌పై కేంద్రం మొహం ఎక్కడ పెట్టుకుంటుందని సీఎం ప్రశ్నించారు. కొందరు సర్వేలు చూసి తెగ సంబరపడిపోతున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోదని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ‘తెదేపా ఓడిపోతే పరిస్థితి ఏంటి’ అని అడిగిన వ్యాపారులకు కూడా తాను అదే సమాధానం చెప్పానని అన్నారు. శనివారం కృష్ణాజిల్లా కేసరపల్లిలో నిర్వహించిన సంక్షేమ పండగ కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘పట్టిసీమ వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు ఇచ్చాం. చంద్రన్నబాట పథకం కింద ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేశాం. రూ.83వేల కోట్ల ఖర్చుతో 23లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. కాపులకు రిజర్వేషన్లు కల్పించి ఎవ్వరూ చేయని సాహసం చేశాను. రూ.50వేల కోట్ల విలువైన 34 ఎకరాల భూమి రైతులు ఉచితంగా ఇచ్చారు. నాపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు అంత భూమిని ఉచితంగా ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భూములు అభివృద్ధి చేసి ఇచ్చాం.’’ ‘‘ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి. ‘తెదేపా ఓడిపోతే మా పరిస్థితి ఏంటి’ అని కొందరు పెట్టుబడిదారులు అడిగారు. ‘తెదేపా ఓడిపోదు, మీ పెట్టుబడులు ఎక్కడికీ పోవు’ అని వ్యాపారులతో చెప్పాను. "
"కొందరు సర్వేలు చూసి సంబరపడిపోతున్నారు. కేంద్రానికి ఎవ్వరూ సహకరించవద్దని కోరుతున్నా. కేంద్రం సహకరించి ఉంటే ఇంకా బాగా అభివృద్ధి జరిగేది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.80వేల కోట్లు రావాల్సి ఉందని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. మనకు అన్యాయం చేసిన పార్టీకి పుట్టగతులు లేకుండా చేయాలి. కేసీఆర్ జగన్ కలిసి నాటకం ఆడుతున్నారు. కోడికత్తి కేసు ద్వారా ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి నెలకొంది. కుట్రలు కుతంత్రాలు చేసిన వారికి తగిన బుద్ధి చెప్పాలి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఐదేళ్లు శ్రమించాను. తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆనాడు చేసినతప్పును కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.’’ అని అన్నారు.