మరోసారి చంద్రబాబు, తెలుగుదేశం నాయకులకు, జాతీయ రాజకీయాల పై స్పష్టత ఇచ్చారు. తనకు ప్రధాని పదవి పై ఆశ లేదని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. తాను ప్రధాని అవుతానని పార్టీ నేతలు ఎవరూ ఎక్కడా మాట్లాడవొద్దని సూచించారు. తాను రాష్ట్రాన్ని వదిలేసి దేశం కోసం తిరుగుతున్నానన్న విమర్శల్ని ఖండించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిపానని చెప్పారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా పలు అంశాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పటిష్టంగా ఉండాలని, తనతో సహా అందరూ బాధ్యతాయుతంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
లీడర్లు అభద్రతకు గురై.. పార్టీని కూడా అభద్రతలోకి నెట్టొద్దని సూచించారు. ప్రతిపక్షాలు కుల, మతాలతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు చంద్రబాబు. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ, జనసేన ఒకే తాను గుడ్డలని విమర్సించారు చంద్రబాబు. జగన్, పవన్, కేసీఆర్ ఎప్పుడూ మోడీని విమర్శించరని, బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రావడం వాళ్లకిష్టం లేదని అన్నారు. తెలంగాణలో తెరాస ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని, ఆ పరిస్థితి లీడర్లు తెచ్చుకోవద్దని హితవు పలికారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వడం లేదని గుర్తు చేశారు చంద్రబాబు. స్వయం కృతాపరాధమే దీనికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదన్నారు.
సమర్ధంగా పనిచేసినంత వరకే ప్రజలు ఆదరిస్తారని.. ప్రజా సేవ విషయంలో తనతో సహా ఎవరికీ మినహాయింపు ఉండదని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పటిష్టంగా ఉండాలని.. నేతలంతా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు ఇప్పటి వరకు 16,21,738కు చేరుకుందని.. నమోదులో ఇంకా వేగం పెంచాలన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఎంతో మందికి పదవులు ఇచ్చామని.. రాబోయే 5 ఏళ్లలో ఇంతకు మించి పదవులు వస్తాయన్నారు చంద్రబాబు. అభివృద్ధే మనందరి కులమని.. పేదల సంక్షేమమే మన మతమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కుల, మత విభేదాలతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన ఒకే తానులో మొక్కలని.. జగన్, కేసీఆర్, పవన్ కళ్యాణ్ ఎజెండా కూడా ఒక్కటనేన్నారు. ఈ ముగ్గురు మోదీని విమర్శించరని.. టీడీపీనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి రాకుండా చేయాలనేదే వీరి లక్ష్యమన్నారు.