చంద్రబాబు గేర్ మార్చుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ, నేతలను అలెర్ట్ చేస్తూ,మాట వినని వారి పై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. వారం రోజుల క్రితం, జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటి సమావేశంలో, తెలుగుదేశం నేతలని వాయించిన సంగతి తెలిసిందే. తాజాగా కడప జిల్లా నేతలకు, మరో సారి క్లాస్ పడింది. నిన్న ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు వెళ్ళిన చంద్రబాబు, అక్కడ నేతలను వాయించారు. కడప జిల్లాలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి చేస్తున్నాం, మీరు అడిగినవి అన్నీ ఇస్తున్నా, మీరు మాత్రం అందరూ కలిసి పని చెయ్యటం లేదు. ఇగోలకి పొతే, అందరూ నష్టపోతామని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలకు క్లాస్ పీకారు. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన, బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు మధ్యాహ్నం 2.10గంటలకు ప్రత్యేక బస్సులో జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. 45 నిమిషాలకుపైగా బస్సులోనే గడిపిన చంద్రబాబు జిల్లా నేతలకు గట్టిగానే హెచ్చరించినట్లు సమాచారం.
కలిసి పని చేయండి, ఎవరి నియోజకవర్గాల్లో ఏమి జరుగుతుందో ఒక్కొక్కరు చెప్పాలని సీఎం కోరారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరన్నది క్లారిటీ ఉందని, ముందుగానే డిసైడ్ అయితే ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని, జిల్లా నేతలు అనడంతో సీఎం జిల్లా నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే తానెందుకు అడ్డు చెబుతాను, అలా ఏ నియోజకవర్గాల్లో క్లారిటీ ఉందో ఆ వివరాలతో రేపే అమరావతికి వచ్చి మాట్లాడాలని చెప్పారు. ఇప్పటివరకు మనం ఏమి చేసింది నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు తెలియజేయాలని సీఎం కోరగా జనవరి నుంచి జరిగే జన్మభూమిలో పాల్గొంటామని నేతలు చెప్పారు. అది అధికారులు చేసే కార్యక్రమమని, పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలంటూ హితోపదేశం చేశారు. నేతల మైండ్‌సెట్ మారాలని క్లారిటీతో నడవాల్సి ఉంటుందని ముఖ్యంగా అందరూ కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో గెలుపు సాధించే దిశగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎ
క్కడెక్కడ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఉన్నారో వాటి వివరాలను తీసుకుని రెండు రోజుల్లోగా అమరావతికి వచ్చి కలవాలని, ముందుగా ఓ రోజు చెబితే సరిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారరా? కలసిపనిచేయమంటే వీధికెక్కి రాజకీయం చేస్తారా అంటూ ప్రొద్దుటూరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులకు నీళ్ల విషయమై ఇన్‌చార్జి సతీష్‌రెడ్డి మాట్లాడినప్పుడు ఇచ్చిన నీళ్ల పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఎమ్మెల్సీ బీటెక్ రవిని రెండు మండలాలకు, సతీష్‌రెడ్డిని మూడు మండలాల బాధ్యులుగా వ్యవహరించాలని సూచన చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలా 45 నిమిషాలపాటు జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. 2.55 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం కడప విమానాశ్రయానికి బయల్దేరారు.