వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఓ సిద్ధాంతం అనేదే లేదని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. పింఛన్లపై జగన్ ప్రకటనను తెదేపా నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రస్తావించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో జగన్‌కు దిక్కుతోచడం లేదన్నారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛను రూ.2 వేలు ఇస్తుంటే.. తాను రూ.3వేలు ఇస్తానంటూ జగన్ ప్రకటించారని మండిపడ్డారు. ఈనెల 11వ తేదీన దిల్లీలో ధర్మపోరాట దీక్ష పెద్ద ఎత్తున చేస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి దీనికి మద్దతు పలకాలన్నారు. 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి నిరసన తెలుపుదామన్నారు.
సమష్టి కృషి తో ఎన్నో విజయాలు అందుకున్నామని, ఇదే స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 80శాతం ఓటు బ్యాంకు సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ల బందరు పోర్టు కల నేడు సాకారం చేస్తున్నట్లు సీఎం వివరించారు. అన్న వస్తున్నాడంటూ వైకాపా చేస్తోన్న ప్రచారంపై టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రస్తావించారు. నేరస్థుడైన జగన్‌ను మహిళలు అన్నగా అంగీకరించరని ఆయన విమర్శించారు. నేరస్థుడు ఎలా ఉండాలో తెలుసు కానీ.. అన్నగా ఎలా ఉండాలో జగన్‌కు తెలుసా? చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైలవరం నియోజకవర్గంలో ఎస్ఐలకు డబ్బులిస్తూ వైసీపీ నేతలు పట్టుపడ్డారన్నారు.
వైసీపీ నేతలు ఈ తరహా ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధమవుతారని, వీరి వ్యవహరంపై నిఘా పెట్టాలని నేతలకు ఆయన సూచించారు. ప్రతి వర్గాన్ని ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని ప్రకటనలు చేసినా ఇబ్బందేం ఉండదని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్ధంగా తీసుకెళ్లాలని సూచించారు. పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీనే కాకుండా.. చెక్కులు బ్యాంకుల్లో వేస్తే డబ్బులు ఇప్పించే బాధ్యతనూ నేతలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.