ఏపీలో సచివాలయం నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాలను రైతులు ఇచ్చారని, తనపై విశ్వాసంతోనే వారు ఇచ్చిన విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ విషయమై కూడా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని, దీని నిర్మాణానికి రూ.250 కోట్లు అయితే సరిపోతుందంటున్న ఆయన ఇంటికి మాత్రం రూ.300 కోట్లు కావాలా? అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకు ఒక పవిత్రమైన దేవాలయం సెక్రటేరియట్ అని, దాన్ని చూడగానే గౌరవం కలిగేలా ఉండాలని అన్నారు. కేసీఆర్ కు ఎక్కువ మెచ్యూరిటీ ఉందని మోదీ ఇటీవల చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.
‘ఆ మెచ్యూరిటీ ఏంటంటే.. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించడం. ఎంత తెలివైన వాడండి! కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పాడండి? తెలంగాణ రాష్ట్రం ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను కలిపేస్తానని చెప్పారు. అదే ఆయన మెచ్యూరిటీ’ అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మోదీ గాడు’ అంటే మోదీకి బాధ లేదు.. అంటే, దాని అర్థమేంటి? లాలూచీ రాజకీయాలేగా? అని విమర్శించారు. ఇష్టపడే ఇద్దరూ తిట్టుకుంటున్నారని, మళ్లీ ఇధ్దరూ కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. తనకేమో భాష రానట్టు.. కేసీఆర్ కు ఏదో బాగా వచ్చన్నట్టు, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుకుని వచ్చినట్టు మాట్లాడుతున్నాడని సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నాతో ‘జై తెలంగాణ’ అనిపించానని అంటున్నాడు. ఆయన అనిపించడమేంటి? తెలంగాణతో నేనెప్పుడు విభేదించాను?
ఆ రోజున రాష్ట్రం కోసం సంపద సృష్టించాను. విభజన కారణంగా ఆ సంపద ఇంకో రాష్ట్రానికి పోయినప్పుడు చాలా మంది నన్ను ‘మీకు బాధగా ఉందా?’ అని అడిగారు. నేను చెప్పాను, ‘నా కెప్పుడూ బాధ లేదు. తెలుగు జాతి కోసం సంపద సృష్టించాను.. ఎంజాయ్ చేస్తారు. భగవంతుడు నాకు శక్తిని ఇచ్చాడు. హైదరాబాద్ కు ఈక్వల్ గా అభివృద్ధి చేస్తాను’ అని చెప్పాను. నరేంద్ర మోదీ పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రిగా ఏం చేశారు? ఏమీ చేయలేదు. అహ్మదాబాద్ లో ఏముంది? ఒక్క ఐటీని ప్రమోట్ చేయలేక పోయారు. నాలెడ్జి ఎకానమీ ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నాలుగేళ్లలోనే ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతోంది. హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్,ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. వీళ్లు నన్ను ఇబ్బంది పెట్టి ఎట్టి పరిస్థితిలో అమరావతి రాకుండా ఉండాలని ప్రయత్నం చేశారు. ఈరోజున వారు డబ్బులు ఇవ్వకపోయినా అమరావతి రియాల్టీ అవుతుంది. వాళ్లకు అసూయ. ప్రధానమంత్రి మన మీద చాలా కక్ష గట్టారు’ అని బాబు విమర్శించారు.