తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణలో గెలుపొందిన శాసనసభ్యులందరికీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా భాజపా బలహీనపడిందని, ఐదేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ భాజపా ఓటమిపాలైందన్నారు. కమలం పార్టీ పాలన పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. ఐదేళ్లలో భాజపా చేసిందేమీ లేదని అన్ని వర్గాలూ గుర్తించాయని, ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు.
భాజపాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో తెదేపా భాగస్వామ్య పక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి శుభాకాంక్షలు’ అని తెలిపారు. కాగా, అంతకుముందు ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు చెప్పారు.
మరో పక్క పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అయుదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పై స్పందించారు. ఫైనల్ మ్యాచ్ అయిన 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడా విజయం సాధించలేదని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మమతాబెనర్జీ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రజాస్వామ్య క్రీడలో ప్రజలే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతలని మమతా వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలను మమతాబెనర్జీ అభినందించారు.