గుంటూరులో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన అనేక ఆరోపణలు పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా సమాధనం చెప్పారు... పవన్ యూ టర్న్ తీసుకున్నారని ఎదురుదాడి చేశారు. నాలుగేళ్లుగా మంచివాడుగా కనిపించిన తాను ఇప్పుడు చెడ్డవాడిగా అయిపోయానా? అని ప్రశ్నించారు. ప్రజలు విశ్వసించినందునే 40 ఏళ్లు రాజకీయంలో ఉన్నానని చంద్రబాబు అన్నారు. తాను మూడు మాటల్లో ఆరు అసత్యాలు మాట్లాడతానని పవన్ విమర్శించారని అన్నిటికి సమాధానం చెప్తున్నా అని చెప్పారు... ఇసుక విక్రయాలకు సంబంధించి ఎక్కడో చిన్నచిన్న పొరపాట్లు జరిగితే... మైనింగ్ స్కామంటూ గాలి జనార్దన్‌రెడ్డితో పవన్ ముడిపెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపామని, అందుకు నిరసన వ్యక్తం చేస్తూ దివంగత మాజీ సీఎం జయలలిత లేఖ పంపారని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఎర్రచందనం వేలంలో రూ.1,230కోట్ల ఆదాయం వచ్చిందని, ఎర్రచందనం వేలానికి కేంద్రం నుంచి అనుమతులు రావాలని చెప్పారు. స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చట్టం తీసుకొచ్చామని, విమర్శించే ముందు పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని జనసేన అధినేతను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏసీబీ కేసుల్లోనూ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. ఉద్దానం కిడ్నీ సమస్య బాధితులకు రూ.2500 పెన్షన్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు.
‘నియోజకవర్గానికి రూ.25 కోట్లు పంపుతున్నామంటూ పవన్ ఆరోపణలు చేస్తున్నారు.. అసలు ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలని కోరుతుందే నేను కదా..’ అని అన్నారు. డిజిటల్ కరెన్సీ తెస్తే అవినీతి ఉండదని, ఎన్నికల్లో డబ్బు పంపిణీ జరగదని చెప్పిందే తాను అని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే ఎలా..? అని పవన్‌ను ప్రశ్నించారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ పెట్టే వాళ్లు తన బంధువులా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగాలు వస్తాయనే మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు అనుమతిచ్చామన్నారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌తో కాలుష్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, తుందుర్రు నుంచి సముద్రంలోకి పైప్‌లైన్ వేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పర్యావరణాన్ని పట్టించుకోవడంలేదని, పరిశ్రమలు రాలేదని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో రాష్ట్రాల పోటీని ఎదుర్కొని కియాను ఏపీకి తెచ్చామని గుర్తుచేశారు. ఫాతిమా విద్యార్థుల కోసం అన్ని ప్రయత్నాలు చేశామని, ఆరోగ్యమంత్రి ఆరు సార్లు ఢిల్లీ వెళ్లారని చంద్రబాబు చెప్పారు.
విభజన హామీల్లో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల లెక్కలను పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటుచేసిన జేఎఫ్‌సీపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆ కమిటీనే ఓ తప్పన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడగకుండా మధ్యవర్తులుగా ఉంటామనడానికి వీరెవరని సీఎం ప్రశ్నించారు. కేంద్రం నుంచి రూ.75 వేల కోట్లు రావాలని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చెప్పిన వివరాల ప్రస్తావన మంగళగిరి సభలో లేదన్నారు. పవన్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని చంద్రబాబు అన్నారు...