నిన్న మదనపల్లిలో ఎన్నికల సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సైకిల్ పాతపడిపోయిందని, సైకిల్ చైన్ కేసీఆర్ తెంపేశారని అన్నారు. అసెంబ్లీకే రాని వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిచారు. ఏ పార్టీతోనైనా పొత్తు కావాలంటే బహిరంగంగానే ప్రకటన చేస్తానని అన్నారు. అయితే పవన్ వ్యాఖ్యల పై చంద్రబాబు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ సైకిల్ చెయిన్ పీకేశాడు అంటూ టీడీపీ పై పవన్ వ్యంగ్యాస్త్రాల పై రావులపాలెం సభలో ప్రస్తావించిన చంద్రబాబు.. కేసీఆర్‌కు ఆ శక్తి ఉందా అని ప్రశ్నించారు. సైకిల్ జోరు పెంచితే.. బుల్లట్‌లా మారి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘సైకిలు వెనక్కి పోతుందా.. సైకిల్ సత్తా ఏంటో కేసీఆర్‌కు తెలుసు! ఒకప్పుడు ఈ సైకిల్ ఎక్కినోడే.
అలాంటి వాడు సైకిల్ చైన్ పీకేస్తాడా.. బుల్లెట్‌లా దూసుకుపోతుంది తప్ప.. వెనక్కిపోదు. అడ్డం వచ్చినోళ్లను తొక్కుకుంటా పోతుంది’’ అంటూ తనదైన శైలిలో పవన్‌కు సమాధానమిచ్చారు. రాయలసీమలో కియా కారు పరుగెడుతోందని.. అదీ మన ప్రతిభ అని చెప్పారు. సినిమా యాక్టర్‌ను నమ్ముకున్నా లాభం లేదన్నారు. సైకిల్ చైన్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుందని.. జాగ్రత్తగా ఉండాలంటూ విపక్షాలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ డబ్బులు పంచి 88 సీట్లు గెలిచారని.. కాంగ్రెస్, తెదేపా సభ్యులనూ లాక్కొన్నారని ఆరోపించారు. అందరికీ ఒకరో ఇద్దరో చెల్లెళ్లు ఉంటారని.. తనకు మాత్రం కోటి మంది ఉన్నారన్నారు. ఇంతమంది అండ ఉంటే మోదీ, కేసీఆర్, జగన్‌కు భయపడతామా అని ప్రశ్నించారు. త్వరలో మహిళలకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తామని.. సమస్యలను యాప్ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. ఐదేళ్లుగా తెలంగాణ కంటే ఎక్కువ వృద్ధిరేటు సాధిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులకు కేంద్రం 750 పురస్కారాలు ఇచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టును దిల్లీలో ప్రశంసిస్తారని.. ఇక్కడ తిడతారని భాజపా నేతలను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని చంద్రబాబు అన్నారు. మీడియా సహా అన్ని వ్యవస్థలనూ మోదీ బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వియత్నాం సైనికులు, ప్రజల్లా అంతా పోరాడాలని పిలుపునిచ్చారు. మోదీ, కేసీఆర్ మనపై దాడి చేస్తుంటే వైకాపా దానికి వంతపాడుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఆ ముగ్గురూ పరస్పరం విమర్శించుకోరని దుయ్యబట్టారు. భాజపా, తెరాస, వైకాపా కుట్రలు అర్థమయ్యాయా అంటూ ఆయన ప్రశ్నించారు. పోలవరం పూర్తయితే కేసీఆర్‌కు వచ్చే నష్టమేంటన్నారు. రాజమహేంద్రవరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.