కడపలో శుక్రవారం నిర్వహించిన రాయలసీమలోని 8 పార్లమెంటరీ నియోజకవర్గాల బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని ఏపీ ప్రజలకు తాను చెప్పదలుచుకున్నానని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కాకుండా స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్టు చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా మంత్రం జపిస్తూ కేంద్రానికి సరైన సలహాలు, సూచలను ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీలో పదేళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే 80 శాతం సాధించినట్టు రాజ్‌నాథ్ తెలిపారు.
ఈ వ్యాఖ్యల పై చంద్రబాబు స్పందించారు. ఏపీకి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇచ్చామని బీజేపీ అనడం హాస్యాస్పదమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో బాబు మాట్లాడుతూ 29సార్లు ఢిల్లీ వెళ్తే మొండిచేయి చూపడమే స్పెషల్ ట్రీట్‌మెంటా..? అని ఆయన ప్రశ్నించారు. గాయాలపై కారం జల్లడమేనా స్పెషల్ ట్రీట్‌మెంటా అని నిలదీశారు. దేశంలోని ఆలయాల్లో అశాంతిని బీజేపీ సృష్టిస్తోందని విమర్శించారు. శబరిమలలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని, రామాలయాన్ని మళ్లీ తెరమీదకు తెస్తోందని, కర్ణాటకలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరదీశారని సీఎం దుయ్యబట్టారు.
కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీ కుట్రలను పదిమందికి చెప్పాలని నేతలకు ఆదేశించారు. ప్రతి కార్యకర్త ఒక మొబైల్ మీడియాగా మారాలని, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని అన్నారు. ఓటర్లలో అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు. ఆదాయం ఉన్న తెలంగాణలో పల్లెలు ఎలా ఉన్నాయని, పట్టణాల్లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. ఆదాయం లేకున్నా ఏపీలో పల్లెలను ఎలా చేశామో, పట్టణాల్లో వసతులు ఎన్ని పెంచామో.. ప్రచారం చేయాలని నేతలకు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లులో ముస్లింలకు మద్దతుగా ఉన్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీగా నిధులిచ్చామని చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితాలో మార్పులపై అందరూ శ్రద్ధ చూపాలన్నారు. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టాలని నేతలతో సీఎం చంద్రబాబు అన్నారు.