‘‘ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ చేయరు. నన్ను తిట్టడానికే వస్తారు. ఒకవేళ నేను కనిపిస్తే కొడతారేమో!’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్రోశించారు. తనపై ఆయన కోపం చూస్తే ఇదే అనిపిస్తోందని తెలిపారు. శుక్రవారం విశాఖ సభలో మోదీ తనపై చేసిన విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ఘాటుగా బదులిచ్చారు. శుక్రవారం రాత్రి పొత్తుపోయాక ఉండవల్లిలోని తన నివాసంలో తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. కుటుంబ పాలన అని మోదీ నన్ను విమర్శింస్తున్నారు. ఆయనకు కుటుంబం ఉంటే కదా తెలిసేది! మనం రోబోలం కాదు. మానవులం. భారతదేశం ఔన్నత్యం కుటుంబ వ్యవస్థలోనే ఉంది. ఎవరి వారసులైనా సామర్థ్యం ఉంటేనే రాణిస్తారు. మోదీ నన్ను బెదిరించాలని చూస్తున్నారు. ఐటీ, ఈడీ, సీబీఐలను చూపిస్తున్నారు. నాడు తిరుపతిలో బాంబులేస్తేనే భయపడలేదు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీలతో ఉన్నా. భయపడే ప్రసక్తే లేదు. పదే పదే కూటమిని విమర్శించడంతోనే ఆయన ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది.
పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మన వైమానిక దళ సిబ్బంది సాహసోపేతంగా చేసిన దాడిని అభినందించాం. కానీ... అదే సమయంలో మోదీ రాజస్థాన్‌లో రాజకీయ సమావేశం పెట్టి ‘దేశాన్ని నేనే కాపాడుతున్నాను’ అని చెప్పుకొచ్చారు. కీలకమైన ఆ సమయంలో ఢిల్లీలో ఉండి, అఖిలపక్ష సమావేశం పెట్టి, అందరినీ కలుపుకొని పోవాల్సిన ప్రధాని... రాజస్థాన్‌లో రాజకీయ సభలో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి... మన దేశభక్తిని శంకిస్తున్నారు. పాకిస్థాన్ పార్లమెంటులో విపక్షాల గురించి చర్చించారని మోదీ అంటున్నారు. కానీ... నిజానికి అక్కడ చర్చించింది ‘ఈ దాడితో బీజేపీ మొత్తం 22 సీట్లు గెలుచుకుంటుంది’ అని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వ్యాఖ్యలపైనే. మరోవైపు... ఎన్నికల ముందు పాక్‌తో యుద్ధం జరుగుతుందని రెండేళ్ల క్రితమే తనకు చెప్పినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
విశాఖను రాష్ట్ర యువకుల కలల నగరంగా మోదీ అభివర్ణించారు. జోన్ ఇస్తున్నామని చాలా గొప్పమాట చెప్పారు. మన విమర్శలను తప్పుపట్టారు. కచ్చితంగా విమర్శించాం. వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేసి, 7000 కోట్ల ఆదాయాన్ని రాయగఢ డివిజన్‌కు ఇచ్చేశారు. మా జోన్‌కు డబ్బుల్లేకుండా... మాయా జోన్ ఇచ్చారు. డివిజన్ లేకుండా జోన్ ఇవ్వడమే మోదీ మాయాజాలం. తెలుగుదేశం పట్టుదలకు 35 ఏళ్ల చరిత్ర ఉంది.. మహానాయకుడు సినిమా చూస్తే అర్థమవుతుంది. అవసరమైతే మోదీకి ఇంకోసారి సినిమా చూపిస్తాం. రాష్ట్రం ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు. కానీ... కేంద్రమే 700 అవార్డులు ఇచ్చింది. మీకు ధైర్యం ఉంటే చెప్పండి... ఈ అవార్డులు తప్పుడువని చెప్పాలి. రైతుకు ఆరువేలు ఇస్తారట. ఇప్పటికి రెండువేలు ఇచ్చారు. మేం 24,500కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. మీరు ఆరువేలు ఇస్తే అదనంగా తొమ్మిదివేలు ఇస్తున్నాం. ఐదెకరాల పైన ఉంటే పైసా ఇవ్వం అన్నారు. వాళ్లు రైతులు కారా? ఎందుకివ్వరు? మేం వారికి కూడా రూ.10వేలు ఇస్తామన్నాం అని చంద్రబాబు అన్నారు.